Saturday, May 11, 2024

సీజన్‌ షురూ.. మొద‌లైన పెళ్లి సంద‌డి.. మండపాలకు పెరిగిన డిమాండ్‌..

మంచి ముహూర్తాలు ప్రారంభం కావడంతో పెళ్లిళ్లు జోరుగా ప్రారంభమయ్యాయి. ఎక్కడ చూసినా మండపాలు పెళ్లిళ్లతో సందడిగా కనిపిస్తున్నాయి. వరుసగా నాలుగు మాసాలపాటు మంచి ముహూర్తాలు ఉండటంతో శుభకార్యాలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. మాఘమాసం ప్రారంభం కావడంతో పెళ్లిళ్లలతో పాటు ఇతర శుభకార్యాలు చేసుకునేందుకు అనుకూలంగా ఉండటంతో సందడి నెలకొంది. ఎక్కడా చూసినా పెళ్లిళ్ల సందడే కనిపిస్తోంది. సీజన్‌ ప్రారంభం కావడంతో అన్ని వర్గాల ప్రజలకు ఉపాధి లభిస్తోంది. వరుసగా మంచి ముహూర్తాలు ఉండటంతో వేలాదిమంది బిజీ అయ్యారు. సీజన్‌ ముగిసేంత వరకు ఉపాధి లభించనుంది. ఈ నెలలో వరుసగా పెళ్లిళ్లలకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికే మండపాలు బుక్‌ చేసుకోవడం పూర్తి చేసి షాపింగ్‌ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉన్నారు.

ఉమ్మడిరంగారెడ్డి, ప్రభన్యూస్ : కరోనా నేపథ్యంలో పెళ్లిళ్లతో పాటు శుభాకార్యాలకు కాస్త బ్రేక్‌ పడింది. కరోనా తగ్గుముఖం పట్టడం మంచి ముహూర్తాలు ప్రారంభం కావడంతో జోరుగా బుకింగ్‌ జరుగుతోంది.పెళ్లంటే బంధు, మిత్రులతో ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గత ఇరవై మాసాలుగా కరోనా భయపెడుతుండటంతో కొంతమేర వెనక్కి తగ్గినా సీజన్‌ ప్రారంభం కాగానే జోరుగా పెళ్లిళ్లు జరిపించుకుంటున్నారు. కరోనా ఆంక్షలు ఉన్న సమయంలో కూడా పెద్దఎత్తున పెళ్లిళ్లు జరిగాయి. ఈ మధ్యకాలంలో మంచి ముహూర్తాలు లేకపోవడంతో శుభకార్యాలు అంతగా జరగలేదు. మాఘమాసం ప్రారంభం కావడంతో పెళ్లిళ్లలతో పాటు గృహప్రవేశాలు, ఎంగేజ్‌మెంట్ల ముహూర్తాలకు సంబంధించి తేదీలు ముందుగానే పురోహితుల ద్వారా తెలుసుకుని పెళ్లిళ్లు ఫిక్స్‌ చేసుకున్నారు.

వరుసగా శుభ ముహూర్తాలు..

వరుస తేదీల్లో మంచి ముహూర్తాలు ఉండటంతో ఎక్కడా చూసినా సందడి నెలకొంది. ఈనెల జోరుగా పెళ్లిళ్లు ఉన్నాయి. ఆదివారం 13వ తేదీన రికార్డు స్థాయిలో పెళ్లిళ్లతో జంటలు ఒక్కటవ్వనున్నాయి.ఈనెల 10, 13, 16, 20 తేదీల్లోవరుసగా పెళ్లిళ్లు నిర్వహించేందుకు ముహూర్తాలు ఫిక్స్‌ అయ్యాయి. మార్చి మాసంలో దాదాపుగా పది మంచి ముహూర్తాలు ఉన్నట్లు పురోహితులు పేర్కొనడంతో సందడి నెలకొంది. ఏప్రిల్‌ మాసంలోనైతే సగం రోజులు పెళ్లిళ్లలకు మంచి ముహూర్తాలు ఉన్నట్లు తేలింది. దీంతో పాటు మే, జూన్‌ మాసాల్లో కూడా ముహూర్తాలు ఉన్నట్లు పురోహితుల ద్వారా తెలుసుకుని ఆ తేదీల్లో పెళ్లిళ్లు జరిపించేందుకు తేదీలు ఫిక్స్‌ చేసుకుంటున్నారు. వరుసగా నాలుగు మాసాల పాటు మంచి రోజులు ఉండటంతో పెళ్లిళ్లతో పాటు ఎంగేజ్‌మెంట్‌, గృహ ప్రవేశాలకు తేదీలు ఖరారు చేసుకుంటున్నారు.

ఫంక్షన్‌హాల్స్‌ బుకింగ్‌ జోరు..

- Advertisement -

వరుసగా ముహూర్తాలు ఉండటంతో ఫంక్షన్‌హాల్స్‌ బుకింగ్‌ జోరుగా కొనసాగుతోంది. కరోనా నేపథ్యంలో కొంతమేర ఇబ్బందిపడ్డా తరువాత పుంజుకుంటున్నారు. జంట జిల్లాల పరిధిలోని శివార్లలో రికార్డు స్థాయిలో ఫంక్షన్‌హాల్స్‌ ఉన్నాయి. తమ ఆర్థిక పరిస్థితులను బట్టి హాల్స్‌ బుక్‌ చేసుకుంటున్నారు.సామాన్య మధ్యతరగతి వర్గాల ప్రజలు ఫంక్షన్‌హాల్స్‌లో పెళ్లిళ్లు జరిపించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆర్థికంగా ఉన్న వాళ్లు మాత్రం డబ్బులకు వెనుకాడకుండా లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. పెద్ద పెద్ద కన్వెన్షన్‌ సెంటర్లు బుక్‌ చేసుకుంటున్నారు. వీటి అద్దె లక్షల్లోనే ఉంటుంది. ఐనా ఏమాత్రం వెనకాడకుండా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

పెరుగుతున్న ఉపాధి అవకాశాలు..

మంచి ముహూర్తాల నేపథ్యంలో అన్ని వర్గాలకు ఉపాధి లభిస్తోంది. పెళ్లి జరిగితే వేలాదిమందికి ఉపాధి లభిస్తుంది. పెళ్లిళ్ల సీజన్‌లో వేలాదిమంది రెండు చేతుల సంపాధించుకుంటారు. సీజన్‌ లేని సమయంలో కాస్త రిలాక్స్‌ అవుతారు. సీజన్‌ ప్రారంభమైతే మాత్రం రాత్రిపగలు అనే తేడా లేకుండా బిజీగా ఉంటారు. పెళ్లిళ్ల సీజన్‌లో పురోహితుల కోసం పరుగులు తీస్తారు. తమకు తెలిసిన వాళ్లు బిజీగా ఉంటే వారికి తెలిసిన వారి ద్వారా కార్యక్రమాలు జరిపించుకునేలా ఏర్పాట్లు చేసుకుంటారు. వంటలు తయారు చేసేవాళ్లను కూడా ముందుగానే బుకింగ్‌ చేసుకోవల్సి ఉంటుంది. కన్వెన్షన్‌ సెంటర్లలో పెళ్లిళ్లు చేసేవాళ్లు మాత్రం మాత్రం క్యాటరింగ్‌కు ఇచ్చేందుకు మొగ్గు చూపుతారు. ప్లేట్ల లెక్కన లెక్కకట్టి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం మీద వరుసగా నాలుగు నెలలపాటు ఉపాధి అవకాశాలు దండిగా లభించనున్నాయి.

జాగ్రత్తలు తప్పనిసరి..

కరోనా పూర్తిగా తగ్గిపోయిందని చాలామంది భావిస్తున్నారు. కనీస జాగ్రత్తలు కూడా తీసుకోవడం లేదు.పెళ్లిళ్ల సీజన్‌ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యఆరోగ్య శాఖ సూచన చేస్తోంది. కరోనా పూర్తిగా తగ్గనందునా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. పెళ్లిళ్లకు హాజరయ్యేవాళ్లు విధిగా మాస్కులు ధరించాల్సి ఉంటుంది.దాంతోపాటు ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలి. సామాజిక దూరం పెళ్లిళ్ల సీజన్‌లో సాధ్యమయ్యే పనికాదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement