Monday, May 6, 2024

గ్రామ స్వరాజ్యంలో సర్కార్‌ సక్సెస్‌.. సీఎం కేసీఆర్‌ వ్యూహం విజయవంతం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు, ఆర్థిక వృద్ధిరేటుకు మూల బిందువైన గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ, వ్యవసాయం, ఇరిగేషన్‌, విద్యుత్‌, విద్య, వైద్యం తదితర రంగాలలో విజయం సాధించినట్లుగానే దేశమంతటా ఈ తరహా వెలుగులు పంచేందుకు సీఎం కేసీఆర్‌ లోతుగా మదింపు చేస్తున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాలను ఏకరీతిలో అభివృద్ధిపర్చి, సర్వతోముఖాభివృద్ధితో ముందుకు నడిపించేందుకు సీఎం కేసీఆర్‌ సంసిద్ధమవుతున్నారు. తనకున్న ముందుచూపు ఆలోచనలతో ఆవిష్కరించిన నూతన పంచాయితీరాజ్‌ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. కొత్త చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో సర్పంచ్‌ల అధికారాలు, బాధ్యతలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వారి పర్యవేక్షణ, ఆదాయ వనరుల పెంపు, నిధుల సద్వినియోగం, పేద వర్గాల అభ్యున్నతి, ముఖ్యంగా రైతు సంక్షేమం, వివిధ పథకాల ద్వారా గ్రామీణ ప్రజలు లబ్ధి పొందాల్సిన విధానంపై అవగాహన పెంచడంలో సర్కార్‌ సక్సెస్‌ అయింది.

స్థానిక సహజ వనరులను వందశాతం సద్వినియోగం చేసుకోవడం ద్వారా అభివృద్ధి లక్ష్యాలను చేరుకునే విధానాలను సూక్ష్మస్థాయి ప్రణాళికలతో అందిపుచ్చుకున్నారు. ఈ ప్రాంతంలో ఏఏ వనరులు, మైన్స్‌ ఉన్నాయో వాటిని సద్వినయోగం చేసుకోడంలో తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించింది. వ్యవసాయ రంగ అభివృద్ధికి, కుల వృత్తుల ప్రోత్సాహకానికి అమలు చేస్తున్న కార్యక్రమాల్లో స్థానిక సంస్థలకు మరిన్ని అధికారాలు, బాధ్యతలు అప్పగించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. గ్రామీణాభివృద్ధి లక్ష్యాల సాధనలో స్థానిక సంస్థలు అత్యంత క్రియాశీలంగా పని చేసేవిధంగా, విధి నిర్వహణలో విఫలమైన వారిపై చర్యలు తీసుకోవడానికి అవకాశం కల్పించే విధంగా ముందుచూపుతో కొత్త పంచాయితీరాజ్‌ రూపొందించారు.

- Advertisement -

కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు పంచాయితీరాజ్‌ వ్యవస్థపై అవగాహన కోసం శిక్షణా కార్యక్రమాలను నిర్వహించారు. ప్రజలకు మరింత జవాబుదారీగా, మరింత క్రియాశీలకంగా తమ కార్యకలాపాలు నిర్వహించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై క్షేత్రస్థాయి అనుభవాలను, అభిప్రాయాలను, భవిష్యత్తు ఆలోచన విధానాన్ని జోడించి వారికి మార్గనిర్ధేశం చేయడంద్వారా పల్లె, పట్టణ పాలన మరింత మెరుగుపడింది. .

బడ్జెట్‌లో గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు

”కేవలం విధులు, బాధ్యతలు అప్పగించి దులుపుకుంటే గ్రామ పంచాయితీలు ఏ పనీ చేయలేవన్న విషయాన్ని సీఎం కేసీఆర్‌ గుర్తించారు. వాటికి కావాల్సిన నిధులు కూడా ప్రతిచేటా బడ్జెట్‌లోనే కేటాయిస్తున్నారు. 2014-15 వార్షిక కేటాయింపులతోనే ఆ ప్రక్రియ మొదలుపెట్టారు. బడ్జెట్‌లో నేరుగా గ్రామ పంచాయితీలకు జనాభా ఆధారంగా నిధులు కేటాయిస్తున్నారు. ఒక్కో గ్రామ పంచాయితీకి రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు నిధులు సమకూరుస్తున్నారు.

ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత కేంద్ర నిధులు, కార్పొరేట్‌ రెస్పాన్సిబిలిటీ కింద లభ్యమయ్యే డబ్బులు, ఫైనాన్స్‌ కమీషన్‌ ద్వారా వచ్చే నిధులు, జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా సమకూరే డబ్బులు అన్నీ జమచేసి గ్రామ పంచాయితీ అప్పగించాలన్న ధృడసంకల్పంతో ఉన్నారు. గ్రామస్తుల్లో కూడా శ్రమదానం ద్వారా పనులు చేసుకునే ధోరణినితోపాటు, పల్లె, పట్టణ ప్రగతితో స్వీయస్వావలంభనను పెంచారు. గ్రామ పంచాయితీకి విధులు, బాధ్యతలతో పాటు కావాల్సిన నిధులు, ప్రజల భాగస్వామ్యం, నిరంతర పర్యవేక్షణ ఉంటేనే సమర్థవంతంగా పనిచేస్తారనన్ది కేసీఆర్‌ అభిప్రాయం.

Advertisement

తాజా వార్తలు

Advertisement