Friday, May 17, 2024

రూ.25 కోట్లు ఇవ్వాల్సిందే – షారూఖ్ ఖాన్ ను డిమాండ్ చేసిన సమీర్‌ వాంఖడే

ముంబై : డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌ఖాన్‌ని అరెస్టు చేసిన మాజీ యాంటీ డ్రగ్స్‌ అధికారి సమీర్‌ వాంఖడే ఈ కేసు నుంచి అర్య‌న్ ను బ‌య‌ట‌ప‌డేసేందుకు షారూఖ్ ఖాన్ ను రూ.25 కోట్లు లంచం అడిగిన‌ట్లు నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సిబి) తాజా నివేదిక వెల్లడించింది. అడిగిన మొత్తం ఇవ్వ‌కుంటే మాదక ద్రవ్యాల కేసులో ఆర్యన్‌ఖాన్‌ని ఇరికిస్తామని బెదిరించినట్లు ఎన్‌సిబి తేల్చి చెప్పింది. అలాగే డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌ఖాన్‌ అతని స్నేహితుడు అర్బాజ్‌ మర్చంట్‌ పేర్లు చివరి క్షణంలో జోడించార‌ని,, మరికొందరు అనుమానితుల పేర్లు తొలగించార‌ని నివేదిక‌లో పేర్కొంది..

అలాగే సమీర్‌ వాంఖడే ఐదేళ్లలో 2017 నుండి 2021 వరకు తన కుటుంబంతో కలిసి లండన్‌, ఐర్లాండ్‌, పోర్చుగల్‌, దక్షిణాఫ్రికా, మాల్దీవులు వంటి దేశాలతో కలిపి ఆరు విదేశాలకు వెళ్లినట్లు కూడా నివేదిక పేర్కొంది. కానీ తాను కేవలం రూ.8.75 లక్షలు మాత్రమే ఖర్చు చేశానని, ఇది విమాన ప్రయాణ ఖర్చులకు సరిపోతుందని ఈ దర్యాప్తులో వాంఖడే చెప్పారు. అయితే సమీర్‌ వాంఖడే ఆదాయ వనరులకు అసమానమైన ఖరీదైన గడియారాలు ఉన్నాయని, ఈ గడియారాల్లో రోలెక్స్‌ వాచ్‌ రూ.22 లక్షల నుండి రూ.17 లక్షల విలువైన వాచ్‌ ఉందని, వీటితోపాటు ఇతర ఆస్తుల వివరాలను ఎన్‌సిబి నివేదిక పేర్కొంది. వాంఖడేకి ముంబైలో నాలుగు ప్లాట్లు, వాషిమ్‌లో 41.688 ఎకరాల భూమి ఉంది. గారెగావ్‌లో రూ. 2.45 కోట్ల విలువైన ఫ్లాట్‌ కోసం రూ 82.8 లక్షలు ఖర్చు చేసినట్లు డ్రగ్స్‌ ఏజెన్సీ అధికారులు పేర్కొన్నారు. ఇక మిస్టర్‌ వాంఖడే, అతని భార్య ఆదాపు పన్ను రిటర్న్‌లు వారి వార్షిక ఆదాయం రూ. 45,61,460 అని చూపించార‌ని,అయితే వారిద్ద‌రి ఆస్తులు అంత‌కు మించి ఉన్నాయ‌ని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement