Saturday, May 18, 2024

Same Sex Marriage Judgement – స్వలింగ సంపర్కుల వివాహంపై సుప్రీం కోర్టు సంచ‌ల‌న తీర్పు….

న్యూఢిల్లీ: దేశంలో స్వలింగ సంపర్కుల వివాహ ప్రక్రియపై కొంతకాలంగా చర్చలు సాగుతున్నాయి. స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధతను కల్పించాలని, దీనికి అధికారిక గుర్తింపు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ విషయంపై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. పలు పిటీషన్లు దాఖలయ్యాయి. స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టపరమైన గుర్తింపు కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇదివరకే విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జేబీ పార్దీవాలాతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్లను విచారణకు స్వీకరించింది.

ఇదే అంశంపై ఢిల్లీ హైకోర్టుతో సహా వివిధ రాష్ట్రాల్లోని ఉన్నత న్యాయస్థానాల ముందు పెండింగ్‌లో ఉన్న పిటిషన్లన్నింటినీ సుప్రీంకోర్టు క్రోడీకరించింది. పిటిషనర్ల తరఫున సీనియర్ అడ్వొకేట్ అరుంధతీ కట్జూ తన వాదనలను వినిపించారు. హైకోర్టుల్లో పెండింగ్‌ లో ఉన్న స్వలింగ వివాహాల గుర్తింపు కోసం దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఇదివరకే విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. జనవరి 6వ తేదీన వాటన్నింటినీ తమకు బదిలీ చేయాలని ఆదేశించింది. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించకుండా గత ఏడాది నవంబరులో సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులను జారీ చేసింది. స్వలింగ సంపర్కులు లేదా భిన్న లింగ సంపర్కులు పరస్పర అంగీకారంతో సెక్స్ చేయడం నేరం కాదని పేర్కొంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని కూడా వెల్లడించింది. స్వలింగ సంపర్కుల వివాహాన్ని వ్యతిరేకిస్తోన్నామని స్పష్టం చేసింది. దీనికి చట్టబద్ధతను కల్పించడం, అధికారికంగా గుర్తింపును ఇవ్వడం సరికాదని తేల్చి చెప్పింది. ఐపీసీలోని సెక్షన్ 377 ప్రకారం- స్వలింగ సంపర్కులు వివాహం చేసుకోవడం నేరమని తెలిపింది.

స్వలింగ వివాహానికి చట్టబద్ధమైన గుర్తింపు అనేది చరిత్రలో లేదని వివరించింది. భిన్న లింగ వివాహానికి మాత్రమే గుర్తింపు ఉందని పేర్కొంది.ఈ పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజాగా మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ పిటీషన్లపై విచారణను అయిదు మంది న్యాయమూర్తుల ధర్మాసనానికి బదిలీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం ఆయా పిటీషన్లపై విచారణను మే 11వ తేదీన ముగించింది. తీర్పును రిజర్వ్ చేసింది. కొద్దిసేపటి కిందటే తన తీర్పును వెలువడించింది ఈ అయిదుమంది న్యాయమూర్తుల బెంచ్.
ఈ ఉదయం 10: 50 నిమిషాలకు బెంచ్ సమావేశమైంది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్.. తీర్పు పాఠాన్ని చదివి వినిపించారు. ఈ పిటీషన్లపై బెంచ్‌లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని అన్నారు. న్యాయ సమీక్ష, అధికారాల విభజన అంశాన్ని తాను డీల్ చేశానని వివరించారు. అధికార విభజన సిద్ధాంతం అనేది న్యాయ సమీక్ష అధికారాన్ని అడ్డుకోబోదని వ్యాఖ్యానించారు. న్యాయస్థానాలు, న్యాయ వ్యవస్థ అనేవి పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణకే ఉన్నాయని డీవై చంద్రచూడ్ చెప్పారు. స్వలింగ సంపర్కం అర్బన్ కాన్సెప్ట్ కాదని, అలాగే- సమాజంలోని ఉన్నత వర్గాలకూ పరిమితం కాదని సీజేఐ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. న్యాయస్థానాలు చట్టాలను రూపొందించలేవని, వాటి సారాంశాన్ని అర్థం చేసుకుని అమలు చేయగలవని సీజేఐ వివరించారు.
వివాహ వ్యవస్థలో సంస్కరణలు అనేవి చట్టాల ద్వారా మాత్రమే సాధ్యమని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థలు ఇందులో సవరణలు చేయలేవని వ్యాఖ్యానించారు. చట్టసభల కార్యకలాపాల్లో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవడం సరికాదని సీజేఐ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ప్రత్యేక వివాహ చట్టం 1954లో సవరణలు చేయాలా? వద్దా? అనేది పార్లమెంట్ వ్యవస్థ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. జీవిత భాగస్వామిని ఎంచుకోవడం అనేది ఒక్కసారే జరుగుతుందని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 సైతం ఇదే సూచిస్తుందని గుర్తు చేశారు. నైతిక విలువలను పరిరక్షించాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరికీ ఉందని, స్వలింగ సంపర్కులు కూడా ఇందుకు మినహాయింపు కాదని డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. స్వలింగ సంపర్కుల పట్ల న్యాయవ్యవస్థ, కోర్టులు వివక్షను చూపట్లేదని సీజేఐ అన్నారు. తమ జీవితాలను స్వేచ్ఛగా, నైతిక బద్ధంగా జీవించే హక్కు సమాజంలో ప్రతి ఒక్కరికీ ఉందని చెప్పారు. ఒక లింగమార్పిడి వ్యక్తి భిన్న లింగ సంబంధంలో ఉంటాడని, అలాంటి వివాహం.. చట్టం ద్వారా మాత్రమే గుర్తింపు పొందుతుందని వివరించారు. వివాహమైన భిన్న లింగ జంట మాత్రమే బిడ్డకు సురక్షితమైన జీవితాన్ని అందించగలదని నిరూపించే అంశాలేవీ లేవని సీజేఐ డీవై చంద్రచూడ్ చెప్పారు. భిన్న లింగ జంటలకు కలిగించే భౌతిక ప్రయోజనాలను స్వలింగ సంపర్క జంటలకు కల్పించడానికి నిరాకరించడం అనేది వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్టే అవుతుందని సీజేఐ అన్నారు.

స్వలింగ సంపర్క దంపతులకు ద‌త్త‌త హ‌క్కు…

- Advertisement -

బిడ్డలను దత్తత తీసుకునే హక్కు స్వలింగ సంపర్క దంపతులకు లేదని, సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ మార్గదర్శకాలు, నియమ- నిబంధనలు దీనికి అనుమతి ఇవ్వట్లేదని వివరించారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 15ను ఉల్లంఘించడమేనని సీజేఐ చెప్పారు కేంద్రం/కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్ర ప్రభుత్వాలు స్వలింగ సంపర్కుల పట్ల ఎలాంటి వివక్ష చూప కూడదని, సమాజంలో అందరిలా జీవించే వాతావరణం కల్పించాల్సి ఉంటుందని అన్నారు. పోలీసులు వారిని వేధించకూడదని, స్వలింగ సంపర్క వ్యవహారాల్లో వారిని పోలీస్ స్టేషన్లకు పిలిపించి విచారణ జరపకూడదని సీజేఐ అన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు పోలీసులు ప్రాథమిక విచారణ జరపాలని ఆదేశించారు. స్వలింగ సంపర్కులు బిడ్డను దత్తత తీసుకోవచ్చని తీర్పు చెప్పారు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్. వారితో పాటు అవివాహిత జంటలు కూడా బిడ్డను దత్తత తీసుకోవచ్చని చంద్రచూడ్ అన్నారు. భిన్న లింగ సంబంధాలలో ఉన్న లింగమార్పిడి వ్యక్తులు వ్యక్తిగత చట్టాలతో సహా ప్రస్తుత చట్టాల ప్రకారం వివాహం చేసుకునే హక్కును కలిగి ఉంటారని చెప్పారు.

లైంగిక ధోరణి ఆధారంగా సమాజంలో తిరుగాడే హక్కును పరిమితం చేయలేమని స్పష్టం చేశారు. సీజేఐ డీవై చంద్రచూడ్ తీర్పును జస్టిస్ కౌల్ సమర్థించారు. ఆయనతో ఏకీభవిస్తోన్నట్లు చెప్పారు. స్వలింగ సంపర్కులు పురాతన కాలం నుంచీ సమాజంలో గుర్తింపు పొందుతున్నారని, వారి మధ్య గల సంబంధాన్ని లైంగికంగా మాత్రమే కాకుండా భావోద్వేగాలను దృష్టిలో ఉంచుకుని చూడాల్సి ఉంటుందని జస్టిస్ కౌల్ అన్నారు. స్వలింగ సంపర్క వ్యక్తుల హక్కులను పరిరక్షించడానికి, వారి హక్కులను నిర్ణయించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని సీజేఐ అన్నారు. స్వలింగ సంపర్క జంటలను రేషన్ కార్డులలో ఒక కుటుంబంగా చేర్చడాన్ని పరిగణనలోకి తీసుకుంటుందని చెప్పారు. స్వలింగ సంపర్క జంటలు ఉమ్మడి బ్యాంకు ఖాతాలకు నామినేట్ చేయడానికి, పెన్షన్ నుండి వచ్చే హక్కులు, గ్రాట్యుటీ మొదలైనవన్నీ పొందగలరని చెప్పారు. ఈ దిశగా కమిటీ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement