Tuesday, June 18, 2024

Big Story: ఆహార సంక్షోభానికి తెర?.. ఉద్రిక్తత నడుమ రష్యా-ఉక్రెయిన్‌ ఒప్పందం

దాడులు, ప్రతిదాడులతో రగిలిపోతున్న రష్యా-ఉక్రెయిన్‌ ఎట్టకేలకు ఒక అంశంపై పట్టువీడాయి. ఉక్రెయిన్‌లో పేరుకుపోయిన ఆహార ధాన్యాల ఎగుమతికి వీలు కల్పించే చరిత్రాత్మక ఒప్పందంపై ఇరు దేశాలు శుక్రవారం సంతకాలు చేశాయి. ఉక్రెయిన్‌నుంచి నల్లసముద్రం మీదుగా ఆహార ధాన్యాలను నౌకల్లో తరలించేందుకు ఈ ఒప్పందం వెసులుబాటు కల్పించనుంది. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభించిన తరువాత ఇరుదేశాల మధ్య కుదిరిన తొలి ఒప్పందం ఇది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం కారణంగా ఇప్పటికే ఆకలితో అలమటిస్తున్నవారు కాకుండా అదనంగా 4.7 కోట్లమంది ఆకలిబారిన పడనున్నారని ఐరాస ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ ఒప్పందం కుదరడం గమనార్హం.

వివాదం మధ్య ఒప్పందం..

యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌-రష్యా మధ్య సంబంధాలు నువ్వానేనా అన్నట్టున్నాయి. ఇస్తాంబుల్‌లో శుక్రవారం ఇరుదేశాల మధ్య జరిగిన ఒప్పందం సమయంలోనూ ఆ ఉద్రిక్త సన్నివేశాలు ఎదురయ్యాయి. ఇరుదేశాల ప్రతినిధులు సంతకాలు చేయాల్సిన వేదికపై ఏ దేశాల పతాకాలు ఉంచాలన్న దానిపై కొద్దిసేపు వాగ్వాదం చెలరేగింది. సంతకాల కార్యక్రమానికి మధ్య మధ్య అంతరాయం ఏర్పడింది. ఒకే ఒప్పంద పత్రంపై రష్యాతోపాటు సంతకం చేసేందుకు ఉక్రెయిన్‌ ససేమిరా అంది. దాంతో కొద్దిసేపు కార్యక్రమం నిలిచిపోయింది. ఆ తరువాత ఒప్పందానికి చెందిన రెండు విడివిడ పత్రాలపై ఇరు దేశాలు విడిగా సంతకాలు చేశాయి. ఐక్యరాజ్య సమితి జనరల్‌ సెక్రటరీ అంటోనియా గుటెర్రస్‌, టర్కీ అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌ సమక్షంలో ఇరు దేశాల ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేశారు. టర్కీ అధ్యక్ష భవనం డొల్‌మబాహెస్‌లో ఈ చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఇవాళ నల్లసముద్రంలో ఓ దివీటీ వెలిగింది. ఓ ఆశాకిరణం మెరిసింది.. అని ఒప్పందానికి ముందు గుటెర్రస్‌ వ్యాఖ్యానించారు. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య ఒప్పందం కుదర్చడంలో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ కీలక పాత్ర పోషించారు. కాగా ఈ అడుగు శాంతికి మార్గం వేస్తుందని ఎర్డోగాన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఉల్లంఘిస్తే ఊరుకోం-జెలెన్‌స్కీ…

కాగా ఈ ఒప్పందాన్ని రష్యా ఉల్లంఘిస్తే తక్షణం దాడులు చేస్తామని ఉక్రెయిన్‌ హెచ్చరించింది. తమ పోర్టులు, ఆహారధాన్యాల నిల్వలపై దాడులు చేస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేసింది. ఐరాస చొరవ, ఎర్డోగాన్‌ బాధ్యత వహిస్తామన్న నేపథ్యంలో ఒప్పందానికి సిద్ధమయ్యామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. కాగా ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదరడంపై అమెరికా, బ్రిటన్‌, ఐరోపా సమాఖ్య సహా పలు దేశాలు హర్షం ప్రకటించాయి. ఒప్పందంలోని నిబంధనలు రష్యా కట్టుబడాలని పిలుపునిచ్చాయి.

- Advertisement -

ఒప్పందంలో కీలక అంశాలు..

ఇరుదేశాల మధ్య తాజాగా కుదిరిన ఒప్పందం ప్రకారం ఉక్రెయిన్‌ పోర్టుల నుంచి నల్లసముద్రంలోని సురక్షిత మార్గాల్లో ఆహార ధాన్యాల రవాణా కొనసాగుతుంది. నల్లసముద్రంలో ఎక్కడికక్కడ రష్యా మందుపాతరలు పేర్చిన నేపథ్యంలో సురక్షిత మార్గాన్ని నిర్దేశించి ఆమార్గంలో నౌకల రవాణాకు అనుమతిస్తారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర తరువాత దాదాపు20 మిలియన్‌ టన్నుల గోధుమలు ఆ దేశానికి చెందిన పోర్టుల్లో నిలిచిపోయాయి. ఎక్కడికక్కడ రష్యా యుద్ధనౌకలు మోహరించి ఉక్రెయిన్‌ నుంచి నౌకలు రాకుండా అడ్డుకున్నాయి. ఈ ఒప్పందం నేపథ్యంలో దాదాపు 10 బిలియన్‌ డాలర్ల విలువైన ఆహార ధాన్యాలు ఇప్పుడు ఎగుమతి కానున్నాయి. ఈ ఒప్పందం నేపథ్యంలో అంతర్జాతీయంగా గోధుమల ధరలు తగ్గే అవకాశం ఉంది.

త్వరలో ఒప్పందం అమలు – క్రెవ్లిున్‌..

ఈ ఒప్పందం అతి త్వరలో అమల్లోకి వస్తుందని రష్యా రక్షణ శాఖ మంత్రి సెర్జీ షోయ్‌గు పేర్కొన్నట్లు క్రెవ్లిున్‌ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. కాగా తమ దేశంపై విధించిన ఆంక్షల సడలింపుపై అమెరికా, బ్రసెల్స్‌ హామీ ఇచ్చినట్లు రష్యా అన్యాపదేశంగా పేర్కొంది. ప్రత్యేకించి రష్యాలో పండిన ఆహారధాన్యాల ఎగుమతిపై ఆంక్షలను సడలించే అవకాశం ఉందని పేర్కొంది. కాగా రష్యా వైఖరిని నిశితంగా గమనిస్తామని బ్రిటన్‌ విదేశాంగమంత్రి లిజ్‌ ట్రస్‌ ప్రకటించారు. ఈ ఒప్పందం బాగుందని అమెరికా ఉన్నతాధికారి ప్రకటించారు.

కాగా ఒప్పందం అమలును ఐరాస, టర్కీ, రష్యా, ఉక్రెయిన్‌ సంయుక్తంగా అమలు చేయాల్సి ఉంటుంది. ఈ నాలుగు వర్గాలు సంయుక్త కమాండ్‌ కంట్రోల్‌ విభాగాన్ని ఇస్తాంబుల్‌లో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. నౌకల రాకపోకలను ఈ కమాండ్‌ కంట్రోల్‌ పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఆ నౌకల రాకపోకలు ఎలా ఉండాలని, ఆహార ధాన్యాల ఎగుమతి తరువాత తిరిగివచ్చే నౌకల్లో ఆయుధాల తరలిస్తున్నారా లేదా అనే విషయాన్ని ఎలా పరిశీలించాలన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కాగా ఇరుదేశాల ఒప్పందం నేపథ్యంలో ఉక్రెయిన్‌ రైతుల్లో ఆనందం వ్యక్తమైంది. ఇప్పటికే వేలాది టన్నుల పంటలను పొలాల్లోనే వదిలేసిన రైతులు ఇప్పుడు తరలించేందుకు సిద్ధమవుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement