Wednesday, May 1, 2024

ఎండియు ఆపరేటర్లకు రూ.9.20 కోట్ల లబ్ధి.. ఈనెల 13వ తేదీ నాటికి నిధుల విడుదల

అమరావతి, ఆంధ్రప్రభ: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధి దారులకు రేషన్‌ అందిస్తున్న ఎండియు వాహనాల ఆపరేటర్లు ప్రతి ఏటా చెల్లించాల్సిన బీమా మొత్తాన్ని ఇక నుంచి ప్రభుత్వమే భరించనుంది. ఇప్పటి వరకు వాహన లబ్ది దారుల నుంచి బీమా ప్రీమియంను ఇన్సూరెన్స్‌ కంపెనీలు వసూలు చేస్తున్నాయి.ఏటా 10 వేల రూపాయలు వారి వేతనం నుంచి బీమా కంపెనీలు కోత పెడుతున్నాయి. ఎండియు లబ్ది దారుల వేతనాలను బ్యాంకుల్లో ప్రభుత్వం జమ చేస్తుండడంతో అందులో నుంచి బీమా ప్రీమియంను ఇన్సూరెన్స్‌ కంపెనీలు వసూలు చేస్తున్నాయి.

అయితే ఇది తమకు చాలా ఇబ్బందికరంగా ఉందని ఎండియు లబ్ది దారులు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు విన్నవించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ప్రీమియం నగదును లబ్ది దారుల నుంచి వసూలు చేయవద్దని, ప్రభుత్వమే ఆ మొత్తాన్ని చెల్లిస్తుందని మంత్రి కారుమూరికి హామీ ఇచ్చారు. ఈ మేరకు బ్యాంకులన్నింటికీ సీఎం జగన్‌ ఓ లేఖ రాశారు. ఈ నెల 13న ప్రీమియం నగదును విడుదల చేయాలని సీఎం ఆర్ధిక శాఖను ఆదేశించారు.

దీంతో ఎండియు లబ్ది దారులకు భారీ ఊరట కలగనుంది.రాష్ట్రం మొత్తం మీద అన్ని జిల్లాల్లో కలిపి 9060 ఎండియు వాహనాలు కలిగిన లబ్ది దారులు ఉన్నారు. వీరందరూ కలిపి ప్రతి ఏటా ఒక్కొక్కరు పది వేల రూపాయల వంతున మొత్తం 9.2 కోట్ల రూపాయలు బీమా ప్రీమియం కింద చెల్లిస్తున్నారు. మంత్రి కారుమూరి చొరవతో వీరికి మేలు జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement