Monday, May 6, 2024

నిరసన తెలిపే హక్కుంది.. హక్కులు, స్వేచ్ఛ అరాచకత్వానికి పునాదులు కారాదు: స్పీకర్ తమ్మినేని

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: చట్టసభల్లో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించడం నిషేధమని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని పార్లమెంటు అనుబంధ భవనంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన స్పీకర్ల సదస్సులో సీతారాం పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అసమ్మతి వ్యక్తపరిచే హక్కు, నిరసన తెలియజేసే స్వేచ్ఛ ఉన్నాయన్నారు. అయితే వాటిని వ్యక్తీకరించే విధానం చట్టానికి, రాజ్యాంగానికి లోబడి ఉండాలన్నారు. హక్కులు, స్వేచ్ఛలు అరాచకత్వానికి పునాదులు కారాదని ఆయన వ్యాఖ్యానించారు. చట్టసభల్లో అమర్యాదకరమైన భాష, పదజాలాన్ని ఉపయోగించడం సమంజసం కాదని, సభాపతులుగా తాము అదే చెబుతామని అన్నారు. తదనుగుణంగా రికార్డుల నుంచి తొలగించడం జరుగుతుందని వెల్లడించారు. స్పీకర్ల సదస్సు గురించి వివరిస్తూ.. కెనడాలోని హాలీఫాక్స్‌లో జరగనున్న 65వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ (సీ.పీ.సీ)కు హాజరుకానున్న ప్రతినిధుల కోసం ఈ సన్నాహక సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. సీ.పీ.సీ కి  హాజరుకానున్న వారికి పాసులు, క్లియరెన్స్ లు, శాసన సంస్థల పనితీరు, హాజరు, ప్రవర్తన నియమావళి మొదలైన అంశాలపై చర్చించామన్నారు. సీ.పీ.సీకి హాజరుకానున్న వారికి లోక్‌సభ సచివాలయం ఏర్పాట్లు చేస్తోందని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement