Wednesday, May 1, 2024

టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి..

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి మరి కొద్ది గంటల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రమాణస్వీకారాని కావాల్సిన ఏర్పాట్లు గాంధీ భవన్ లో పూర్తి అయ్యాయి. రేవంత్ రెడ్డి నియామకంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. రేవంత్ రెడ్డి పట్టాభిషేకానికి సర్వం సిద్ధమైంది. రేవంత్ ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ పార్టీ కీలన నేతలు హాజరు కానున్నారు. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులతోపాటు కర్ణాటక నాయకులను కూడా కలిసి ప్రమాణస్వీకారాని రావాల్సింది ఆహ్వానించారు. అసంతృప్తి నేతలను సైతం కలిసి తన పట్టాభిషేకానికి రావాలని కోరారు. భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, మర్రి శశిధర్ రెడ్డి తదితర నాయకులతో రేవంత్ కలిశారు.

మరోవైపు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాల నుంచి నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. రేవంత్ బాధ్యతలు చేపట్టనున్న క్రమంలో ఆయన అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతారు? అన్నది ఆసక్తి రేపుతోంది.

రేవంత్ రెడ్డి పాదయాత్రకు సంబంధించిన కీలక ప్రకటన చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే రైతుల సమస్యలపై అచ్చంపేట నుంచి హైదరాబాద్ నుంచి పాదయాత్ర చేశారు. ఇప్పుడు తెలంగాణవ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నారని తెలుస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి ఆగస్ట్ 9 నుంచి పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రేవంత్ కూడా పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారనే చర్చ జరుగుతోంది. అయితే, పాదయాత్ర విషయంలో తొందరపాటు అవసరం లేదని  కొందరు సీనియర్ నేతలు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం మీద రేవంత్ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి నిర్ణయం ఏం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement