Tuesday, April 30, 2024

వీవీప్యాట్ ల మార్పుపై శ‌శాంక్ గోయ‌ల్ వివ‌ర‌ణ‌..ఏం చెప్పారో తెలుసా..

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో వీవీ ప్యాట్ విష‌యంలో పెద్ద దుమార‌మే చెల‌రేగింది. ఈ విష‌యంపై కాంగ్రెస్ నేత‌లే కాదు బిజెపి నేత‌లు కూడా ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. సీఎం కేసీఆర్ ఓట‌మి భ‌యంతోనే వీవీ ప్యాట్ ల‌ను మార్చార‌ని మండిప‌డ్డారు. ఈ మేర‌కు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శ‌శాంక్ గోయ‌ల్ కి ఫిర్యాదు చేశారు. కాగా ఈ విష‌య‌మై ఆయ‌న స్పందించారు. ఆ వీవీ ప్యాట్ కి ఎన్నికలతో సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. వీవీ ప్యాట్ ను ఒక వాహనం నుండి మరో వాహనంలోకి మారుస్తున్న సమయంలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ కు హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డి వివరణ ఇచ్చారు. పనిచేయని వీవీప్యాట్ ను ఒక వాహనం నుండి మరో వాహనంలోకి మార్చామని ఆయన శశాంక్ గోయల్ కు వివరించారు. పోలింగ్ కు ముందే ఈ వీవీప్యాట్ ను పక్కన పెట్టామని ఆయన చెప్పారు. పోలింగ్ ముగిసిన తర్వాత కరీంనగర్ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ కాలేజీ రిసెప్షన్ సెంటర్ కు ఎదురుగా ఉన్న రోడ్డుపై ఒక వాహనం నుండి మరో వాహనంలోకి మార్చినట్టుగా ఆయన శశాంక్ గోయల్ కు నివేదిక ఇచ్చారు.

ఎన్నికల అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు.ఈ విషయమై వివరణ ఇవ్వాలని కరీంనగర్ కలెక్టర్ , హుజూరాబాద్ అసెంబ్లీ రిటర్నింగ్ అధికారిని కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ ఆదేశించారు. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 200 నెంబర్ పోలింగ్ కేంద్రంలో పనిచేయని వీవీప్యాట్ స్థానంలో మరో వీవీ ప్యాట్ ను మార్చారు. అయితే పోలింగ్ ముగిసిన తర్వాత ఒక ప్రభుత్వ వాహనం నుండి మరో ప్రభుత్వ వాహనంలోకి ఈ వీవీప్యాట్ ను మార్చే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వీడియో తీశారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు బయటపెట్టారు. పోలింగ్ మెటిరీయల్ ను తీసుకెళ్లే బస్సులో కాకుండా ప్రైవేట్ వాహనంలో వీవీ ప్యాట్ ను తీసుకెళ్లారని కాంగ్రెస్ ఆరోపించింది. అధికారాన్ని ఉపయోగించుకొని టీఆర్ఎస్ వీవీప్యాట్లను మార్చిందని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement