Wednesday, December 6, 2023

Follow up | హైదరాబాద్‌ అభివృద్ధిలో గేమ్‌ ఛేంజర్‌గా రీజినల్‌ రైలు కనెక్టివిటీ నెట్‌వర్క్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రీజినల్‌ రింగురోడ్డుతోపాటు దానికి అనుసంధానంగా రీజినల్‌ రైలు రావడం విశ్వనగరంగా హైదరాబాద్‌ అభివృద్దిలో గేమ్‌ చేంజర్‌గా మారబోతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ మరింత అభివృద్ధి చెందాలంటే ఆర్‌ఆర్‌ఆర్‌ అత్యంత కీలకమన్నారు. ట్రిపుల్‌ఆర్‌ వస్తే రవాణా కనెక్టివిటీ పెరిగి ఆ రోడ్డు లోపల పేదలకు తక్కువ ధరకు భూములు దొరుకుతాయన్నారు. పేదల సొంతింటి కల నెరవేరుతుందన్నారు. ఏ రాష్ట్రాన్రికి లేని విధంగా అత్యధికంగా తెలంగాణకు అత్యధికంగా వందే భారత్‌ రైళ్లు వస్తున్నాయని చెప్పారు.

దేశంలో చారిత్రక, ప్రఖ్యాత 111 నగరాలను అనుసంధానం చేస్తూ ఒకేరోజున 9 వందే భారత్‌ రైళ్లను ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం గొప్ప విషయమన్నారు. తెలంగాణ రాష్ట్రాన్రికి ఇప్పటికే రెండు వందే భారత్‌ రైళ్లు వచ్చాయని, ఆదివారం నాడు మూడో వందే భారత్‌ హైదరాబాద్‌- బెంగళూరు రైలును ప్రధాని ప్రారంభించారని సంతోషం వ్యక్తం చేశారు. వినాయక చవితి సందర్భంగా మూడో -టైన్‌ ప్రారంభించుకోవడం శుభపరిణామమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఆదివారం కాచిగూడ- యశ్వంతపూర్‌ వందేభారత్‌ రైలుకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు.

- Advertisement -
   

హైదరాబాద్‌ కేంద్రంగా మూడు వందే భారత్‌ రైళ్లను ఇచ్చినందుకు ప్రధాని మోడీతోపాటు రైల్వే శాఖమంత్రికి తెలుగు ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. కాచీగూడ నుంచి ప్రారంభమయిన తాజా వందేభారత్‌ రైలుమూడు రాష్ట్రాలను ల్లోని 12 జిల్లాలను కలపనుందన్నారు. వందే భారత్‌ రైలు రాకతో బెంగళూరుకు ఒకే రోజు వెళ్లి రావొచ్చని చెప్పారు. తెలంగాణలో రైల్వేల అభివృద్ధి కోసం ప్రధాని మోడీ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు.

మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత తొమ్మిదిన్నరేండ్లలో ఏటా 55 కిలోమీటర్ల రైల్వే లైన్‌ల నిర్మాణం రాష్ట్రంలో చేపట్టారని వెల్లడించారు. 2014 యూపీయే హయాంలో తెలంగాణకు రైల్వే బడ్జెట్‌ రూపంలో రూ.258 కోట్లు ప్రవేశపెట్టారుని, ప్రస్తుతం మోడీ ప్రభుత్వం రూ.4,418 కోట్లు కేటాయించిందని చెప్పారు. తెలంగాణలో 31 వేల కోట్ల రూపాయల రైల్వే పనులు నిర్మాణంలో ఉన్నాయన్నారు. దాదాపు రూ.2300 కోట్లతో తెలంగాణలో అనేక రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని చెప్పారు.

సికింద్రాబాద్‌ స్టేషన్‌కు 717 కోట్ల రూపాయలు కేటాయించి ప్రధాని స్వయంగా శంకుస్థాపన చేశారని, పనులు పూర్తయితే ఎయిర్‌ పోర్ట్‌ మాదిరిగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌మారబోతోందని, నాంపల్లి రైల్వే స్టేషన్‌ ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నాయని, కాచీగూడ ఆధునీకరణ పనులు త్వరలో ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. కాజీపేటలో రైల్‌ మ్యానుఫ్యాక్చర్‌ యూనిట్‌ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, ఫస్ట్‌ పేజ్‌ లో వ్యాగన్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ మొదలవుతుందని తెలిపారు. ఆ తర్వాత రైలుకు సంబంధించిన అన్ని ఉత్పత్తులు అక్కడ తయారవుతాయని వెల్లడించారు.

మెరిట్‌ విద్యార్థులకు సన్మానం…

విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మంత్రి కిషన్‌రెడ్డి సన్మానించారు. ఈ మేరకు అంబర్‌ పేట్‌ మండల్‌ గుర్తింపు పొందిన స్కూల్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 2023 లో మెరిట్‌ సాధించిన విద్యార్థులను కిషన్‌రెడ్డి సన్మానించారు. అంబర్‌ పేట్‌ మండల్‌లోని 60కి పైగా ప్రైవేట్‌ స్కూల్‌ లోని సుమారు 200లకు పైగా విద్యార్థులను సన్మానించారు.

ఈ కార్యక్రమం లో 200మందికి పైగా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అదేవిధంగా… ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరిగిన అఖిల భారతీయ క్షత్రియ మహాసభ 1897 తెలంగాణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. క్షత్రియ మహాసభ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినం దించారు. పలు రంగాల్లో క్షత్రియులు రాణించేలా ప్రభుత్వాలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

తొమ్మిదేళ్లుగా నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం… ఉద్యోగాల భర్తీలో టీఎస్‌పీఎస్పీ విఫలం

రాష్ట్రంలో గడిచిన తొమ్మిదేళ్లుగా నిరుద్యోగులకు న్యాయం జరగడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో టీఎస్‌పీఎస్సీ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నిరుద్యోగులు అప్పులు చేసి మరీ కోచింగ్‌ తీసుకుంటున్నారని, అయితే ఉద్యోగాలను భర్తీ చేయకుండా సీఎం కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.

ఆక్టోబరు 1న తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటిస్తారని చెప్పారు. బేగంపేటలో సివిల్‌ ఏవియేషన్‌ రీసెర్చ్‌ సంస్థకు శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. అనంతరం పాలమూరులో నిర్వహించే బహిరంగసభలో ప్రధాని పాల్గొంటారని చెప్పారు. తెలంగాణకు పర్యటన సందర్భంగా అనేక రైల్వే ప్రాజెక్టులకు ఫౌండేషన్‌ స్టోన్‌ వేయబోతున్నారని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement