Sunday, October 13, 2024

Monsoon | ముంబయిలో వాన కల్లోలం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ముంబాయి నగరం విలవిలలాడిపోతోంది. వర్షాల కారణంగా గడచిన 24 గంటల్లో ఆరుగురు మరణించారు. ముంబాయిలో వచ్చే 48 గంటలకు పైగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) సూచించింది. మంగళవారానికి ఆరెంజ్‌ హెచ్చరిక జారీ చేసింది. ఈశాన్య ముంబాయిలోని గోవండి ప్రాంతంలో శనివారం పొద్దుపోయాక వరదనీటితో నిండిపోయిన రోడ్డును బాగు చేస్తున్న ఇద్దరు కాంట్రాక్టు కార్మికులు మాన్‌ హోల్‌ పడి మరణించారు. మృతులను రామ్‌ కిషన్‌(30), సుధీర్‌ దాస్‌(35)గా గుర్తించారు. పశ్చిమ ముంబాయిలోని విలే పార్లే గోవాథన్‌ ప్రాంతంలో ఆదివారం ఉదయం రెండతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో వృద్ధ జంట రోబీ మిస్కిట్టా(70), ప్రిస్కిల్లా మిస్కిట్టా(65) దుర్మరణం పాలయ్యారు.

- Advertisement -

ఆ తర్వాత కొద్ది గంటలకు తూర్పు ఘట్‌కోపర్‌లోని రామాబాయి అంబేద్కర్‌ నగర్‌లో ఒక కిరాయి గృహాల సముదాయం కుప్పకూలిపోవడంతో అనేక మంది అందులో చిక్కుకుపోయారు. దుర్ఘటనలో ఇద్దరు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. సోమవారం ఉదయానికి మృతదేహాలను వెలికితీశారు. మృతులను ఆల్కా పలన్‌డే(94), ఆమె కుమారుడు నరేష్‌ పలన్‌డేగా గుర్తించారు. గాయపడిన వారిని రాజావాది ఆసుపత్రికి తరలించగా వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని బీఎంసీ విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. పశ్చిమ భందుప్‌లో బాదల్‌ సొసైటీలో గ్రౌండ్‌ ఫ్లోర్‌లోకి రోడ్డుపైన ఉన్న వరద నీరు కొట్టుకురావడంతో వసుమతి నాయర్‌(75) అనే వ్యక్తి స్వల్పంగా గాయపడ్డారు. ముంబాయిలో అనేక ప్రాంతాలు వరదనీటి ముంపునకు గురయ్యాయి.

లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్ళలోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో అక్కడి ప్రజలు అప్రమత్తమయ్యారు. ముంబాయి, కోస్తా కొంకణ్‌ ప్రాంతంలో సోమవారం అంతా భారీ వర్షాలు, అక్కడక్కడా చిరు జల్లులు పడ్డాయి. అయితే రైళ్ళు, విమానాలు, రోడ్లపై వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదు. మహారాష్ట్రలోని పాల్‌ఘడ్‌, థానే, రాయ్‌గఢ్‌, రత్నగిరి, సింధుదుర్గ్‌ లాంటి జిల్లాల్లో జూన్‌ 30 వరకు తీవ్రమైన కురుస్తాయని ఐఎండీ సూచించింది. ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement