Sunday, April 28, 2024

Online Marketing | వేగంగా ఆన్‌లైన్‌ మార్కెట్‌ వృద్ధి.. అతి పెద్ద మార్కెట్‌గా డెవలప్​

దేశంలో ఆన్‌లైన్‌ మార్కెట్‌ విస్తరిస్తోంది. ఆఫ్‌లైన్‌ మార్కెట్‌ కంటే ఆన్‌లైన్‌ మార్కెట్‌ 2.5 రేట్లు వేగంగా పెరుగుతోంది. ప్యూచర్‌ రిటైల్‌ పేరుతో డెలాయిట్‌ ఒక నివేదికను విడుదల చేసింది. 2022 నాటికి 70 బిలియన్‌ డాలర్లుగా ఆన్‌లైన్‌ మార్కెట్‌ 2030 నాటికి 325 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని నివేదిక తెలిపింది. 2022లో వ్యవస్థీకృత రిటైల్‌ మార్కెట్‌ విలువ 110 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇది 2030 నాటికి 230 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని డెలాయిట్‌ నివేదిక అంచనా వేసింది. సంప్రదాయ రిటైల్‌ మార్కెట్‌ విలువ కంటే ఆన్‌లైన్‌ మార్కెట్‌ విలువ ఎంతో ఎక్కువగా ఉండనుంది.

ఆన్‌లైన్‌ మార్కెట్‌ వేగంగా పెరుగుతున్నప్పటికీ 2030 నాటికి ఆఫ్‌లైన్‌ మార్కెట్‌ విలువ 1,605 బిలియన్‌ డాలర్లగా అతి పెద్ద
మార్కెట్‌గా ఉంటుందని పేర్కొంది. 2022 నాటికి ఆఫ్‌లైన్‌ మార్కెట్‌ విలువ 860 బిలియన్‌ డాలర్లుగా ఉంది. గత 5 సంవత్సరాలుగ ఇండియాలో ఆన్‌లైన్‌ మార్కెట్‌ వేగంగా విస్తరిస్తోంది. తేలిగ్గా ఆర్డర్‌ చేయడం, రిటర్స్‌ పాలసీ, లాజిస్టిక్స్‌ పెరగడం, మౌలికసదుపాయాలు పెరగడం, 19వేల పిన్‌కోడ్స్‌లో డెలివరీ సదుపాయలు ఉండటం, ఆన్‌లైన్లో 220 మిలియన్‌ షాపర్స్‌, ప్రైవేట్‌ ఈక్విటీ, వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థల నుంచి 23 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వంటి సానుకూల అంశాల మూలంగా ఆన్‌లైన్‌ మార్కెట్‌ శరవేగంగా పెరుగుతున్నదని డెలాయిట్‌ నివేదిక తెలిపింది.

ద్వితీయ, తృతీయ స్థాయి నగరాల్లోనూ ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్న వారి సంఖ్య బాగా పెరగడంతో రిటైల్‌ మార్కెట్‌ స్వరూప స్వభావాలు పూర్తిగా మారిపోయాయని నివేదిక తెలిపింది. 2022 నాటికి దేశంలో ప్రధాన నగరాల నుంచే 60 శాతం ఆన్‌లైన్‌ ఆర్డర్లు ఉన్నాయి. అదే సమయంలో ద్వితీయ శ్రేణి నగరాల నుంచి వస్తున్న ఆన్‌లైన్‌ ఆర్డర్లలో 65 శాతం, తృతీయ శ్రేణి నగరాల నుంచి వస్తున్న ఆన్‌లైన్‌ ఆర్డర్లలో 50 శాతం పెరుగుదల నమోదైంది. ప్రధాన నగరాల నుంచి వస్తున్న ఆన్‌లైన్‌ ఆర్డర్లలో పెరుగుదల కేవలం 10 శాతంగా మాత్రమే ఉంది. మొత్తం ఆన్‌లైన్‌ బిజినెస్‌ 325 బిలియన్‌ డాలర్లలో సామాజిక వాణిజ్యం విలువ 55 బిలియన్‌ డాలర్లుగా ఉండి అతిపెద్ద దిగా ఉంటుందని పేర్కొంది. క్విక్‌ కామర్స్‌ విలువ 40 బిలియన్‌ డాలర్లు, డైరెక్ట్‌ టూ కస్టమర్‌ (డీ2సీ) వాణిజ్యం విలువ 20 బిలియన్‌ డాలర్లుగా 2030 నాటికి ఉంటుందని నివేదిక తెలిపింది.

- Advertisement -

ఆఫ్‌లైన్‌ రిటైల్‌ మార్కెట్‌ విలువ1,605 బిలియన్‌ డాలర్లలో సంప్రదాయ విధానంలో ఉన్న మార్కెట్ల విలువ 1.375 బిలియన్‌ డాలర్లుగా, ఆర్గనైజ్‌డ్‌ రిటైల్‌ మార్కెట్ల విలువ 230 బిలియన్‌ డాలర్లుగా 2030 నాటికి ఉండ నుందని పేర్కొంది. దేశంలో ఆన్‌లైన్‌ బిజినెస్‌ పెంచేందుకు ప్రభుత్వం, ప్రైవేట్‌ సంస్థలు కూడా ఆసక్తిగా ఉన్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా అమెజాన్‌ సీఈఓ అండీ జెస్సీ ఆయనతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా అమెజాన్‌ 2030 నాటికి ఇండియాలో 26 బిలియన్‌ డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం కూడా ఆన్‌లైన్‌ బిజినెస్‌ను ప్రోత్సహించేందుకు ఒక ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసింది. కేంద్రానికి చెందిన డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డీపీఐఐటీ) ఆధ్వర్యంలో ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌ (ఓఎన్‌డీసీ) పేరుతో డిజిటల్‌ ఆన్‌లైన్‌ ఇ-కామర్స్‌ పోర్టల్‌ను ఏర్పాటు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement