Thursday, April 25, 2024

రాష్ట్రంలో నాలుగు రోజులపాటు వర్ష సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : అకాల వర్షాలు, వడగళ్ల వానలకు పంటలు దెబ్బతినడంతో ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన రైతులను వరి పంట చేతికందే సమయంలో వడగళ్ల వాన భయం వెంటాడుతోంది. ఆకాశం మబ్బు పడితే చాలు రైతుల గుండె వేగం పెరుగుతోంది. ఎప్పుడు ఎటువైపు నుండి ఈదురుగాలితో కూడిన అకాల వర్షంతోపాటు వడగళ్ల వాన పడుతుందోనన్న భయంతో రైతులు కాలం వెళ్లదీస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వరిపైర్లు గింజ గట్టిపడే దశలో ఉన్నాయి. ఈ ఏడాది వానాకాలంలో విస్తారంగా వర్షాలు కురవడంతో యాసంగి నాట్లు వేసే సమయానికి అంటే డిసెంబరు, జనవరి నెలలో విస్తారంగా భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయి. వాటితోపాటు కాలువలు, చెరువుల కింద సాగునీటి వనరులు ఈ సారికూడా విస్తారంగా అందుబాటులో ఉంటాయన్న ధీమాతో రైతులు పెద్ద ఎత్తున వరి సాగు చేశారు. తెలంగాణ ప్రాంత చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంతగా యాసంగిలో ఈ సారి రికార్డు స్థాయిలో దాదాపు 56లక్షల ఎకరాల్లో వరి సాగయింది. అయితే పంట ఈనే దశలో మార్చి నెలలలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి.

అదే సమయంలో వాగులు, చెరువులు, రిజర్వాయర్ల కింద సాగునీరు అందుబాటులో లేకపోవడంతో వరి పొలాలు గణనీయమైన విస్తీర్ణంలో ఎండిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో గడిచిన నెల రోజులుగా రైతులు వరుస తడులమీద వరిపొలాలు ఎండిపోకుండా నానా అవస్థులు పడుతూ పంటను కాపాడుకుంటున్నారు. నాలుగు రోజులకు ఒక మడి చొప్పున తడి అందిస్తూ పంట మండి ఎండకుండా రాత్రింబవళ్లు ఊరిన నీరు ఊరినట్లే తడులు అందిస్తున్నారు. రైతుల శ్రమ ఫలించ చి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వరి పైర్లు గింజ గట్టిపడే దశలో ఉన్నాయి. ఇంకొక్క 10 రోజులు ఆగితే వరి పంట చేతికందే సమయం. అయితే ఈ తరుణంలో రైతులను అకాల వర్షాలు, వడళ్ల వానల భయం వెంటాడుతోంది.

- Advertisement -

ఇప్పటికే అకాల వర్షాలతో పంటలను నష్టపోయిన రైతులు ఏప్రిల్‌ 5 వరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని రోజులు గడుపుతున్నారు. మరో వారం , పది రోజులు అకాల వర్షాలతోపాటు వడగళ్లు కురవొద్దని దేవుడిని ప్రార్థిస్తున్నారు. యాసంగిలో ఎకరాకు దాదాపు 30వేల పెట్టుబడి పెట్టామని, అందులో ఇప్పటికే భూగర్భ జలాలు పడిపోవడంతో కొంత మేర పంటి ఎండిపోయిందని, ఇప్పుడు వడగళ్ల వాన కురిస్తే ఉన్న పంట కూడా నేలపాలవుతుందని, అప్పుడు తాము ఆర్థికంగా అప్పుల పాలు కాక తప్పదన్న ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.

నాలుగు రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజులపాటు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్‌ వాతావరణకేంద్రం తెలిపింది. పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశ మందని హెచ్చరించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ను జారీ చేసింది. ఈ నెల 1 నుంచి 5వ తేదీ వరకు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని పేర్కొంది. తూర్పు మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు సముద్రమట్టం నుంచి 1.5కి.మీ. ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో అయిదే రోజులపాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

రాబోయే 48 గంటలు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో ఉరుములతో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. నైరుతి దిశ నుంచి గంటలకు 4 నుంచి 6 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశముందని వెల్లడించింది. శని, ఆది, సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరింది. వర్షాలు కురిసే సమయంలో ఆరుబయట , చెట్ల కింద సంచరించొద్దని సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement