Wednesday, April 24, 2024

Spl Story | అమరావతిలో ఆర్‌-5 జోన్‌, ప్రభుత్వం గెజిట్​ జారీ..  అసలు ఆర్​5 జోన్​ అంటే ఏమిటి?

అమరావతిలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వైఎస్సార్​ సీపీ ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. విజయవాడ, గుంటూరు నగరాలకు చెందిన పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రత్యేక జోన్‌ ఏర్పాటు చేసింది. దీన్నే ఆర్​5 జోన్​ అని పిలుస్తారు. దీనికి ప్రభుత్వం గెజిట్​ జారీ చేయడంపై మరోసారి వివాదం చెలరేగుతోంది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

హైకోర్టు, రాజధాని ప్రాంత రైతుల అభ్యంతరాలను కాదని అమరావతిలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం గెజిట్​ నోటిఫికేసన్​ విడుదల చేసింది. విజయవాడ, గుంటూరు నగరాలకు చెందిన పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రత్యేక జోన్‌ ఏర్పాటు చేసింది. ఇప్పటికే సీఆర్‌డీఏ చట్ట సవరణ చేసిన ప్రభుత్వం, అమరావతి ప్రజారాజధాని కావాలంటే ప్రజలు నివసించటానికి ఇళ్ల స్థలాలు ఇస్తే తప్పేంటన్న కోణంలో తాజాగా తెరచాటు మంత్రాంగాన్ని అమల్లోకి తెచ్చినట్టు తెలుస్తోంది. తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు, మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాల పరిధిలో 900.97 ఎకరాల మేర పేదల ఇళ్ల కోసం జోనింగ్‌ చేస్తున్నట్టు ప్రకటించింది.

ఇక.. ఎంపిక చేసిన భూముల ప్రాంతాన్ని ఆర్‌-5 జోన్‌గా పేర్కొంటూ గెజిట్​ నోటిఫికేషన్​ జారీ చేసింది. అమరావతి రాజధాని మాస్టర్‌ ప్లాన్‌లో కూడా ఈ మేరకు మార్పులు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఆర్‌-5 జోన్‌పై అభ్యంతరాలు, సూచనలు, సలహాలు స్వీకరించటానికి 15 రోజుల గడువు ఇవ్వగా.. దీనిపై కొంతమంది హైకోర్టుకు వెళ్లారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన ఆర్‌-5 జోన్‌తో రాజధాని భూములను ఇతరులకు కేటాయించేందుకు అడుగులు వేస్తున్నట్టు స్పష్టవుతోంది. గుంటూరు, విజయవాడ నగరాలకు చెందిన దాదాపు 28 వేల మందికి ప్రస్తుతం ఆర్‌-5 జోన్‌ పరిధిలోకి తీసుకువచ్చిన గ్రామాలలో గతంలో ఇళ్ల స్థలాలను కేటాయించింది. దీనిపై రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించారు.

- Advertisement -

అయితే.. ప్రభుత్వ చర్యలను హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. రాజధాని నిర్మాణం కోసం తీసుకున్న భూముల విషయంలో రైతులకు ఇచ్చిన హామీలకు, చేసుకున్న ఒప్పందాలకు భిన్నంగా వెళ్లటం తగదని, ఈ రకమైన చర్యలు చెల్లవని పేర్కొంది. ఈ క్రమంలో ప్రభుత్వం మూడో కంటికి తెలియకుండా సీఆర్‌డీఏ చట్టంలో సవరణలు చేసింది. ఈ సవరణల ప్రకారం రెండు అధికారాలు సీఆర్‌డీఏకు, రాష్ట్ర ప్రభుత్వానికి వస్తాయి. రాజధానిలో పేదలకు ఇళ్ల పేరుతో స్థలాలు ఇవ్వడంతో పాటు రాజధాని భూములను టౌన్​షిప్​ల పేరుతో అమ్ముకోవటానికి, బదలాయించటానికి అధికారాలు సంక్రమిస్తాయి. కాగా, విజయవాడ, గుంటూరు నగరాలకు చెందిన 28 వేల మంది పేదలకు ఇప్పటికే ఇళ్ల పట్టాల ముద్రణ పూర్తి అయ్యినట్టు తెలుస్తోంది.  

అమరావతి బృహత్‌ ప్రణాళిక (మాస్టర్ ప్లాన్) ప్రకారం.. 4 నివాస జోన్లు ఉండేవి.

  • 1) ఆర్‌-1 అంటే.. ప్రస్తుత గ్రామాలు..
  • 2) ఆర్‌-2 అంటే తక్కువ సాంద్రత గృహాలు..
  • 3) ఆర్‌-3 అంటే తక్కువ నుంచి మధ్యస్థాయి సాంద్రత కలిగిన గృహాలు..
  • 4) ఆర్‌-4 అంటే హైడెన్సిటీ జోన్‌ పేర్లతో 4 రకాల నివాస జోన్లు ఉండేవి.
  • 5) తాజాగా.. కృష్ణాయపాలెం, వెంకటపాలెం, నిడమర్రు, కురగల్లు, మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలోని 967.25 ఎకరాలను నివాస ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. అందులోని 900.97 ఎకరాలను ఆర్‌-5 జోన్‌గా ఏర్పాటు చేస్తూ గెజిట్‌ జారీ చేసింది.
Advertisement

తాజా వార్తలు

Advertisement