Friday, March 29, 2024

Delhi | ఫోన్లు ధ్వంసం చేశారని నవంబర్‌లోనే కిషన్‌రెడ్డి ఎలా చెప్పారు? ఢిల్లీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఎదుర్కోలేక ఉద్దేశపూర్వకంగానే ఎమ్మెల్సీ కవితను ఇబ్బందులకు గురి చేస్తున్నారని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఎంపీలు వెంకటేష్ నేత, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి, గణేష్ గుప్తా, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ సోమ భరత్ తదితరులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. కవిత తాను వాడిన పది ఫోన్లను ధ్వంసం చేశారంటూ గత నవంబర్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడిన వీడియోను శ్రీనివాస్ గౌడ్ మీడియా ఎదుట ప్రదర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ఏ ఆధారం లేకుండా ముందే ఉంహించి నవంబర్‌లోనే సెల్ ఫోన్లపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆడబిడ్డ, బాధ్యత గల ఎమ్మెల్సీ అయిన కవితపై ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.

ఈడీ అధికారులు నిన్న ఫోన్ల గురించి అడగ్గా… ఇవాళ ఆమె అందరికీ చూపించి మరీ మొబైల్స్ తీసుకెళ్లారని తెలిపారు. తాను వాడిన ఫోన్లన్నీ భద్రంగా ఉన్నాయని కవిత గతంలోనే చెప్పారని, ఈడీకి లేఖ కూడా సమర్పించారని ఆయన అన్నారు. మీకూ ఓ ఆడపిల్ల ఉందని గుర్తు చేసిన మంత్రి, తెలంగాణ ఉద్యమంలో ఎంత మంది ఆడవాళ్లు కొట్లాడారో తెలుసా అంటూ నిలదీశారు. కోట్ల విలువ గల ఫోన్లు ధ్వంసం చేశారని కిషన్‌రెడ్డి ఎలా మాట్లాడారు? ఓ ఆడబిడ్డపై మీ ప్రతాపమా అంటూ శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. అధికారులు నోటీసులు ఇవ్వడాని కంటే ముందే ఇద్దరు బీజేపీ ఎంపీలు ఢిల్లీలో కవిత ప్రతిష్టకు భంగం కలిగేలా మాట్లాడారని ఆయన అన్నారు. ఇది వంద కోట్ల స్కాం అయితే నీరవ్, లలిత్ మోదీ, విజయ్ మాల్యా, అదానీవి లక్షల కోట్ల స్కాములు కాదా అంటూ మండిపడ్డారు.

- Advertisement -

చోక్సీ భాయిని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, రెడ్ కార్నర్ నోటీసులను ఉపసంహరించుకుంటూ రెడ్ కార్పెట్ వేస్తున్నారని మంత్రి తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న వ్యక్తులను వదిలేసి తెలంగాణ బిడ్డను పది నెలలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు. కొన్ని టీవీ ఛానెళ్లు పైశాచికానందం పొందుతున్నాయని, ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఉన్నవి లేనట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభమైన మీడియా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. తెలంగాణ మాదిరి పరిపాలన మీ బీజేపీ పాలిత ఏ రాష్ట్రంలోనైనా ఉందో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. కేసులు ఎదుర్కొంటున్న వారు బీజేపీలో చేరితే గంగ నదిలో మునిగినట్టు పాపాలు పోతాయన్నట్టు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు.

ఈడీకి కవిత ఇచ్చిన లేఖపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమాధానం చెప్పి క్షమాపణ కోరాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. అధికారం చేతిలో ఉందని ఇష్టారీతిగా వ్యవహరిస్తే ఉరుకోబోమని హెచ్చరించారు. దేశం మీద గౌరవం ఉంటే దేశాన్ని దోచుకునే వాళ్ళను ఢిల్లీ గడ్డపై ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు క్షమించరని, తగిన శాస్తి చేస్తారని జోస్యం చెప్పారు. కేంద్రం కుట్రలను ధైర్యంగా ఎదుర్కొనేందుకు అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. గతంలో ఈ అంశంపై ఇష్టారాజ్యంగా మాట్లాడిన ప్రతిఒక్కరు ముక్కు నేలకు రాయాలన్నారు. కేంద్రం బెదిరింపులకు భయపడేదే లేదని, లొంగి పోయేదే లేదని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. రాణి రుద్రమ, చాకలి ఐలమ్మ వంటి ధీరవనితలు పుట్టిన గడ్డపై పుట్టిన పులి బిడ్డ ఎమ్మెల్సీ కవిత అని ఆయన చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement