Friday, May 17, 2024

Delhi | ప్రధానిది దళిత రాజకీయం.. బీజేపీతో కలిసి పవన్ తప్పుచేశారు : చింతా మోహన్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దళిత రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆరోపించారు. ఎస్సీలకు కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదన్న ప్రధాని ఆరోపణలను ఆయన తప్పుబట్టారు. కృష్ణా జిల్లాలో అంటరానితనాన్ని చూసిన గాంధీ దక్షిణాఫ్రికాలో ఈ వివక్షపై పోరాటం మొదలుపెట్టి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారని, ఆ తర్వాత అంటరానితనంపై పోరు జరిపారని గుర్తుచేశారు.

అలాగే ఎస్సీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ పార్టీయేనని తెలిపారు. దేశానికి మొదటి రాష్ట్రపతి విజయవాడకి చెందిన దళితుడు చక్రయ్యను చేయాలని గాంధీ భావించారని.. కానీ ఆయన చనిపోవడంతో అది జరగలేదని తెలిపారు. ప్రధాని మోడీ అదానీ, అంబానీలకు చేస్తున్నారు తప్ప ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చేసిందేమీ లేదని విమర్శించారు.

మరోవైపు తెలంగాణలో బీజేపీతో కలిసి పవన్ కళ్యాణ్ తప్పుచేశారని చింతా మోహన్ అన్నారు. ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా ఉపయోగం ఏమీ ఉండదని, గరిష్టంగా గెలిస్తే 5 సీట్లు గెలుస్తారని సూత్రీకరించారు. తెలంగాణలో ఎన్టీఆర్ పోటీ చేసినా సరే గెలవరని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఇప్పుడు గెలిచేది కాంగ్రెస్ పార్టీయేనని, ఏపీలో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చూస్తున్నారని, కానీ తమ పార్టీ నేతలే ప్రజలను ఓట్లు అడగడం లేదని అన్నారు. 75 ఏళ్ల రాజకీయాల్లో బ్రతికి ఉన్నది ఇందిరా గాంధీ మాత్రమేనని అన్నారు. ఏపీలో జగన్ పాలన బాగుటుందని భావించానని, కానీ ఆయన డీలా పడ్డారని చింతా మోహన్ అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement