Friday, May 17, 2024

సరోగసి వ్యాపారానికి అడ్డుకట్ట.. ఏటా రాష్ట్రంలో వేల కోట్లలో వ్యాపారం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణలో సరోగసీచట్టం-2021, అసిస్టెడ్‌ రిప్రొడక్టివ్‌ టెక్నాలజీ చట్టం-2021 అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బోర్డు, అథారిటీలను ఏర్పాటు చేసింది. బోర్డుకు వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి హరీష్‌రావు ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి వైఎస్‌ ఛైర్మన్‌గా, అదనపు కార్యదర్శి … కార్యదర్శిగా, వివిధ విభాగాల కమిషనర్లు, డైరెక్టర్లు సభ్యులుగా ఉండనున్నారు. అథారిటీకి వైద్యారోగ్యశాఖ స్పెషల్‌ సెక్రటరీ లేదా అడిషనల్‌ సెక్రటరీ ఛైర్మన్‌గా ఉంటారు. కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ వైస్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. వివిధ విభాగాలకు చెందిన ముగ్గురు సభ్యులు ఉంటారు. సరోగ సి, కృత్రిమ గర్భదారణ పేరుతో జరుగుతున్న వైద్య చికిత్సా వ్యాపారాన్ని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 2021లో తెచ్చిన చట్టాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం తాజాగా బోర్డును, అథారిటీని ఏర్పాటు చేసింది. ఇకపై తెలంగాణలో జరిగే సరోగసి జననాలు, ప్రక్రియను బోర్డు పూర్తిగా పర్యవేక్షించనుంది.

కాగా… ప్రతి ఏటా తెలంగాణలోని హైదరాబాద్‌తోపాటు వరంగల్‌ తదితర నగరాల్లోని ఫర్టిలిటీ (సంతాన సాఫల్య ఆసుపత్రులు) ఆసుపత్రుల్లో పెద్ద ఎత్తున సరోగసి వ్యాపారం జరుగుతోంది. పలు ప్రయివేటు ఆసుపత్రులు… పేదరికంలో మగ్గుతున్న తల్లుల కష్టాలను ఆసరగా చేసుకుని డబ్బు ఆశ చూపి సరోగసి ద్వారా వారు బిడ్డను కనేందుకు ఒప్పిస్తున్నారు. అందుకు ఒప్పుకున్న తల్లుకు నామమాత్రంగా చెల్లించి… సరోగసి దంపతుల నుంచి మాత్రం లక్షల్లో వసూలు చేస్తున్నారు. చాలా సంధర్బాల్లో సరోగసి ద్వారా బిడ్దను కనేందుకు ఒప్పుకున్న తల్లుల ఆరోగ్యం బాగా క్షీణించి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోతున్నారు. ఆ సమయంలో ప్రయివేటు ఆసుపత్రులు వారిని ఆదుకోవడం లేదు. ఏమంటే అగ్రిమెంట్‌ ప్రకారం బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తల్లి ఆరోగ్యం ఏమైనా తాము బాధ్యత వహించమని స్పష్టం చేస్తున్నారు. ఇకపై లక్షల్లో సరోగసి వ్యాపారం, అందుకు ఒప్పుకున్న పేద తల్లుల మరణాలకు అడ్డుకట్ట పడనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement