Friday, April 26, 2024

కేసీఆర్ పాలన రాక్షస పాలన అన్నారు.. అలాంటి కేసీఆర్‌తో ఎలా జతకట్టారు? : పొంగులేటి సుధాకర్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు పాలనను రాక్షస పాలనతో పోల్చిన కమ్యూనిస్టులు మునుగోడు ఉప-ఎన్నికల్లో ఆయనతో ఎలా జతకట్టారని భారతీయ జనతా పార్టీ తమిళనాడు రాష్ట్ర సహ ఇంచార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. గురువారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, ఇటు కేసీఆర్, అటు కమ్యూనిస్టుల తీరుపై విరుచుకుపడ్డారు. మునుగోడు ఉపఎన్నికల్లో కేసీఆర్ డబ్బుతో ఓటర్లను ప్రభావితం చేశారని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని మండిపడ్డారు. టీఆర్ఎస్, కమ్యూనిస్టుల కలయిక అపవిత్రమైనదని, కమ్యూనిస్టులను చూస్తే ప్రజలు అసహ్యించుకుంటున్నారని పొంగులేటి అన్నారు. బీజేపీని చూసి కేసీఆర్ భయపడుతున్నారని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో కుంభకోణాలు చేయడమే కాదు, రాష్ట్ర సరిహద్దులు దాటి ఢిల్లీలోనూ మద్యం కుంభకోణంలో టీఆర్ఎస్ నాయకులు భాగమయ్యారని పొంగులేటి ఆరోపించారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలపై కేసీఆర్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్, ఇతర కుటుంబ పార్టీలు విషం కక్కుతున్నాయని అన్నారు. మోడీ ప్రధాని అయ్యాక భారతదేశ గౌరవ, ప్రతిష్టలు ప్రపంచదేశాలకు తెలిసేలా చేశారని, జీ-20 సదస్సులో ప్రపంచ దేశాలు మోదీని పొగడ్తలతో ముంచెత్తడమే ఇందుకు నిదర్శనమని పొంగులేటి వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement