Friday, March 29, 2024

జస్టిస్ ఎన్వీ రమణపై జగన్ ఆరోపణల కేసు.. నోటీసులిచ్చేందుకు సుప్రీం నిరాకరణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై తీవ్రస్థాయి ఆరోపణలు చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరును తప్పుబడుతూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ గురువారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. నిజానికి ఈ పిటిషన్ వర్ల రామయ్య కేసుతో జతచేసి ఉంచగా.. జస్టిస్ ఎం.ఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం ఆ కేసుతో ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని గుర్తించింది. దాంతో ఈ కేసును డీ-ట్యాగ్ (విడదీసి) మరో కేసుగా లిస్ట్ చేసింది. ఈ కేసులో పిటిషనర్ సునీల్ కుమార్ సింగ్ స్వయంగా తన వాదనలు వినిపించారు. ముఖ్యమంత్రి నాటి సుప్రీంకోర్టు జడ్జిపై తీవ్ర అనుచిత వ్యాఖ్యలు, ఆరోపణలు చేశారని తెలిపారు.

ఏ రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రీ ఈ తరహాలో ప్రవర్తించలేదని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి ముఖ్య సలహాదారు ఏకంగా మీడియా సమావేశం నిర్వహించి ఆరోపణలు చేశారని, అవన్నీ పత్రికలు, మీడియాలో ప్రచురితమయ్యాయని చెప్పారు. ఇది న్యాయవ్యవస్థ గౌరవానికి, ప్రతిష్టకు భంగం కలిగించే చర్య అని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ తరహా ప్రవర్తన సరికాదని వ్యాఖ్యానించారు. ఈ కేసును విచారణకు స్వీకరించి ప్రతివాది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నోటీసులు జారీ చేయాలని పిటిషనర్ కోరారు. అయితే నోటీసులు జారీ చేసేందుకు నిరాకరించిన ధర్మాసనం, తదుపరి విచారణ డిసెంబర్ 12న చేపడతామని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement