Tuesday, April 23, 2024

Big story | వేపపువ్వు దొరకట్లే, ఎగబడుతున్న జనం.. మార్కెట్లో ఫుల్‌ డిమాండ్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఉగాది పండగ అంటే అందరికీ నోరూరించే పానియం ఉగాది పచ్చడి. ఆ ఉగాది పచ్చడి షడ్రుచుల మయం. అందులో తీపి, వగరుతోపాటు చేదు రుచికి అత్యంత ప్రాధాన్యత. ఉగాది పచ్చడికి ఆ చేదు రుచి రావాలంటే అందులో కచ్చితంగా వేపపువ్వు వేయాల్సిందే. అయితే ఈసారి ఉగాది పండగకు వేప పువ్వుకు కరువొచ్చిపడింది. ఒకప్పుడు ఉగాది వచ్చిందంటే ఇంటి ఆవరణలోనే ఇంటికి ఆ పక్కో ఈ పక్కో వేపచెట్టుకు వేప పువ్వు దొరికేది. సమీపంలోని ఒక్క వేపచెట్టు పువ్వు ఆ కాలనీ మొత్తం ఇళ్లలో తయారు చేసే ఉగాది పచ్చడికి సరిపోయేది. అయితే ఈ ఏడాది ఉగాది పచ్చడికి వేపపువ్వు కోసం పేటదాటి ఊరుదాటి పొలిమేరల దాకా వెళ్లి వెతుక్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా ఉగాది అంటే ఆకురాలి కొత్త చిగుళ్లు వేయడంతోపాటు పూత పూయాల్సిన వేప చెట్లు ఎండిపోయి కనిపిస్తున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని వేపచెట్లకు నాలుగేళ్ల క్రితం వైరస్‌ సోకింది. పలు దఫాలుగా వైరస్‌ సోకడంతో మొదటిసారి బతికి బట్టగట్టిన వేప చెట్లు… మరోసారి సోకడంతో చాలా వరకు ఎండిపోయాయి. 10 వేప చెట్లను తీసుకుంటే అందులో 9 చెట్లు ఎండిపోయి , కనీసం చిగురించడమే కష్టమైన పరిస్థితుల్లో మోడువారి కనిపిస్తున్నాయి. కొన్ని చెట్లు సగం ఎండిపోయి, సగం ఆకుపచ్చగా కనిపిస్తున్నాయి. ఊరి మొత్తంలో పూర్తి ఆరోగ్యంగా ఉండి పూత పూసిన వేపచెట్లు వేళ్లమీద లెక్కే పెట్టే సంఖ్యలోనే ఉన్నాయంటే వేపచెట్లపై వైరస్‌ ఏ మేర దాడిచేసిందో అర్థం చేసుకోవచ్చు.

- Advertisement -

ఆరోగ్యంగా ఉన్న ఒకటి, రెండు వేప చెట్లకు కూడా చిటారు కొమ్మల్లో పువ్వ ఉంటోంది. అసలే పట్టణాల్లో కాంక్రీట్‌ జంగిళ్ల విస్తరణ కారణంగా వేపచెట్లు క్రమంగా మాయమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వేపచెట్లకూ వైరస్‌ సోకడంతో ఊళ్లోనూ ఉగాది పండగకు వేపపువ్వు కరువైన పరిస్థితులు నెలకొన్నాయి. ఉగాది పండగ నేపథ్యంలో వేప పువ్వుకు కొరత ఏర్పడడంతో మార్కెట్‌ లో వేపపువ్వు కు డిమాండ్‌ ఏర్పడింది. 15 రెబ్బలున్న వేపపువ్వు కట్టను హైదరాబాద్‌లో రూ.50కి విక్రయిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.


ఉగాదినాడు షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి చేసుకోవడం తెలుగు ప్రజల సాంప్రదాయం. ఇందులో కారం, పులుపు, వగరు, ఉప్పు, తీపి, చేదు ఇలా ఆరు రుచులతో ఉగాది పచ్చడి చేయడం ఆనవాయితీ. పులుపు కోసం చింతపండు, వగరు కోసం మామిడి పిందెఉ, తీపి కోసం బెల్లం, చేదు రుచి కోసం వేపపువ్వును వాడుతారు. అయితే వైరస్‌ సోకిన వేపచెట్ల నుంచి వచ్చిన పువ్వును పచ్చడి తయారీలో వినియోగించాలా..? వద్దా అన్న విషయంలో జనం వెనుకాడుతున్నారు. అయితే ఉగాది పచ్చడిలో వేపపూతను కలిపి తినొచ్చని, ఇబ్బందేమీ లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వర్షాలకు తేమ, గాలి వల్ల శిలీంద్రాలు వేపచెట్ల పైకి చేరి ఎండు తెగులు కారణమయ్యాయని దాంతో వేపచెట్లు ఎండిపోతున్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు.

ఫామోస్ఫిస్‌ అజాడిర క్టే, ఫ్యూసారియమ్‌ అనే శిలీంద్రాల కారణంగా వేపచెట్లు ఎండిపోతున్నాయని, ఈ శిలింద్రాల ప్రభావం ఎక్కువగా ఉంటే చెట్ల కొమ్మలే కాదు, మొత్తం చెట్టే చనిపోతుందని హెచ్చరిస్తున్నారు. శిలీంద్రానలు నియంత్రించేందుకు లీటర్‌ నీటిలో ఒక గ్రాము కార్బండిజమ్‌ లేదా మ్యాంకోజెబ్‌, కార్బండిజమ్‌ మిశ్రమాన్ని 2.5గ్రాముల చొప్పున కలిపి చెట్లపై చల్లాలని సూచిస్తున్నారు. అయితే వేపచెట్లను రక్షించేందుకు ఇటు ప్రజల వైపు నుంచి గాని, అటు ప్రభుత్వం వైపు నుంచి గాని ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడంతో ఏటా వైరస్‌ బారిన పడుతూ వేపచెట్లు ఎండిపోతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement