Friday, May 17, 2024

Peddapalli – గులాబీ దండులోకి ఉద్యమ దళం

తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన ఉద్యమ నాయకులు తిరిగి గులాబీ దళంలో చేరుతున్నారు. గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉన్న ఉద్యమ దళం గులాబీ దండులో చేరడంతో పెద్దపల్లి బిఆర్ఎస్ లో నూతన ఉత్తేజం నెలకొంది. ఉద్యమ కాలంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా, టిఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడిగా పనిచేసిన సి.సత్యనారాయణ రెడ్డి, మాజీ ఎంపీపీ వేముల రామ్మూర్తి తో పాటు ఉద్యమ నాయకులు మున్సిపల్ శాఖ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరేందుకు హైదరాబాదుకు పయనమయ్యారు. వారిని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా సిఎస్ఆర్ మాట్లాడుతూ తిరిగి మాతృ పార్టీకి వస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. తెలంగాణలో ఎగిరేది గులాబీ జెండా మాత్రమేనని, పెద్దపల్లి లో మూడోసారి దాసరి మనోహర్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధిస్తారన్నారు. బిఆర్ఎస్ విజయం కోసం కలిసికట్టుగా పని చేస్తామన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను నమ్మే పరిస్థితి లేదన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టేందుకు పని చేస్తామన్నారు.

ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యమ కాలంలో కీలక పాత్ర పోషించిన సి ఎస్ ఆర్ రామ్మూర్తిలు తిరిగి మాతృ పార్టీలోకి రావడం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమవుతుంది తప్ప ఇతర పార్టీలతో సాధ్యం కాదని నమ్మి తిరిగి బిఆర్ఎస్ లో చేరుతున్నారన్నారు. రాబోయే కాలంలో పార్టీలో సముచిత స్థానం ఉంటుందని, ఉద్యమ సమయంలో జెండా మోసిన ప్రతి ఒక్కరిని గౌరవంగా చూసుకుంటామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement