Monday, April 29, 2024

PBKS vs MI | పోరాడి ఓడిన పంజాబ్.. కీల‌క మ్యాచ్‌లో ముంబై విజయం

ఐపీఎల్ 2024లో భాగంగా నేడు జరిగిన ఉత్కంఠ పోరులో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ముల్లన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 పరుగుల తేడాతో గెలుపొందింది. 193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ జట్టు చివరి ఓవర్ వరకు పోరాడింది. ఇక 19.1 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. ఇక ఈ విజయంతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న ముంబై 7వ స్థానానికి చేరుకుంది.

అయితే, పంజాబ్ కింగ్స్ టాపార్డర్ పూర్తిగా విఫలమైనప్పటికీ… మిడిలార్డర్ బ్యాటర్లు శ‌శాంక్ సింగ్, అశుతోష్ శర్మ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అశుతోష్ శర్మ (61; 28 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. శ‌శాంక్ సింగ్ (41; 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) రాణించాడు. హర్‌ప్రీత్ బ్రార్ (21) పరువాలేదరనిపించాడు. ఇక ముంబై బౌల‌ర్ల‌లో బుమ్రా, గెరాల్డ్ కోయెట్జీ చెరో మూడు వికెట్లు పడగొట్టగా… శ్రేయాస్ గోపాల్, ఆకాశ్ మ‌ధ్వాల్, హార్దిక్ పాండ్యలు త‌లా ఓ వికెట్ దక్కించుకున్నారు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు నష్టానికి 192 ప‌రుగులు చేసింది. ముంబై బ్యాట‌ర్ల‌లో సూర్యకుమార్ యాదవ్ (78; 53 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ చేయ‌గా తిల‌క్ వ‌ర్మ (34 నాటౌట్; 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), రోహిత్ శ‌ర్మ (36; 25 బంతుల్లో 2ఫోర్లు, 3సిక్స‌ర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీశాడు. సామ్ కరణ్ రెండు వికెట్లు తీయగా కగిసో రబడా ఓ వికెట్ పడగొట్టాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement