Friday, April 26, 2024

రేపటినుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ భేటీ.. ఈడీ, సీబీఐ దాడులు, మహిళాబిల్లు ఎజెండాగా విపక్షాలు రెడీ

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు రెండవ విడత నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు అధికార, విపక్షాల మధ్య వాడీవేడీ చర్చకు దారితీసే అవకాశం ఉంది. వాగ్వాదాలు, వాకౌట్‌లతో ఉభయసభలు మరోసారి దద్దరిల్లనున్నట్లు కనిపిస్తున్నాయి. బడ్జెట్‌ కేటాయింపులపై చర్చకంటే, రాజకీయ అంశాలే ప్రధాన ఎజెండా అవుతాయని ప్రధాన ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ఢిల్లి మద్యం స్కామ్‌లో మనీశ్‌ సిసోడియా అరెస్టు, భారాస ఎమ్మెల్సీ విచారణతోపాటు లాలూ కుటుంబ సభ్యులపై సీబీఐ విచారణ, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, ప్రైవేటుకంపెనీల్లో ఎల్‌ఐసీ పెట్టుబడులు, ద్రవ్యోల్బణం, మహిళా రిజర్వేషన్‌ బిల్లు వంటి అంశాలపై ప్రతిపక్షాలు మోడీ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధ మవుతున్నాయి.

అదే సమయంలో యూకే పర్యటనలో రాహుల్‌ ప్రసంగాలపై ఎదురుదాడికి దిగాలని బీజేపీ యోచిస్తున్నది. భారత ప్రజాస్వామ్యాన్ని రాహుల్‌ అవమానించారని ఆ పార్టీ ఆరోపిస్తున్నది.మొత్తంగా ఈ సమావేశాలు ఈ అంశాలచుట్టే తిరుగుతూ, రాజకీయవేడిని రాజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం లోక్‌సభ ప్రివిలేజెస్‌ కమిటీ ముందు హాజరైన బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే, రాహుల్‌ గాంధీపై చర్యలకు డిమాండ్‌ చేశారు. అతని లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దుచేయాలని కోరారు. మరోవైపు కాంగ్రెస్‌, టీఎంసీ ఎంపీలు రాహుల్‌ను సమర్థించారు. రాజ్యసభలో ప్రభుత్వంతోపాటు ఉపరాష్ట్రపతిపైనా దాడికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి. వ్యక్తిగత సిబ్బందిని పార్లమెంటరీ కమిటీల్లో నియమించుకోవడాన్ని అనేక పార్టీలు తప్బుబడుతున్నాయి. రాజ్యసభలో ఈ అంశంపై చర్చకు పట్టుబట్టేందుకు రెడీ అవుతున్నాయి.

అయితే ఈ నియామకాలను రాజ్యసభ చైర్మన్‌ ధన్‌కడ్‌ సమర్థించుకున్నారు. నైపుణ్యం, శిక్షణ పొందిన మానవశక్తిని సమకూర్చే ప్రయత్నంలోనే ఈ నియామకాలు జరిగాయని పేర్కొన్నారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు కమిటీల సభ్యులు, అధ్యక్షులతో విస్తృతంగా సంప్రదింపులు జరిపామని చెప్పారు. ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో, రాజ్యసభ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరించాలని అన్ని పార్టీలకు పిలుపునిచ్చారు. కాగా, రెండవ సెషన్‌ ఏప్రిల్‌ 6వరకు కొనసాగుతుంది. మొదటి దశలో అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ నివేదిక ప్రకంపనలతో ఉభయసభల్లో ఆందోళనలు కొనసాగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement