Monday, April 29, 2024

పాకిస్థాన్ జ‌ర్న‌లిస్ట్ తో అమ‌రీంద‌ర్ సింగ్..టార్గెట్ చేసిన కాంగ్రెస్..

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప‌లు రాష్ట్రాల‌కి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో పంజాబ్ లో కూడా ఎన్నిక‌ల హ‌డావుడి నెల‌కొంది. పంజాబ్ లో నాలుగు నెల‌ల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. సీఎం ప‌ద‌వి నుంచి కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ ని త‌ప్పించ‌డంతో అక్క‌డి రాజ‌కీయాలు హాట్ గా మారాయి. కాంగ్రెస్ పార్టీ నుండి బ‌య‌టికి వ‌చ్చిన అమ‌రీంద‌ర్ సింగ్ కొత్త పార్టీ స్ధాపిస్తున్న నేపథ్యంలో ప్రత్యర్ధులు ఆయన్ని పలు విధాలుగా టార్గెట్ చేస్తున్నారు.పంజాబ్ లో మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ త్వరలో కొత్త ప్రాంతీయ పార్టీ పెట్టబోతున్నారు. ఆయనకు కాంగ్రెస్ లో ఉన్న మద్దతుదారుల్ని కలుపుకుని ఈ పార్టీని స్ధాపించబోతున్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని రంగంలోకి దిగాలని భావిస్తున్నారు అమ‌రీంద‌ర్ సింగ్. తనను తీవ్రంగా అవమానించిన కాంగ్రెస్ పార్టీకి పరాభవాన్ని చవి చూపించే లక్ష్యంతో అమరీందర్ అడుగులు వేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు కూడా ఆయన్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టేశారు. ఇదే క్రమంలో అమరీందర్ సన్నిహితురాలు, పాకిస్తానీ జర్నలిస్ట్ అరూసా ఆలం పేరు తెరపైకి వస్తోంది. అరూసా ఆలంను టార్గెట్ చేస్తూ పంజాబ్ డిప్యూటీ సీఎం సుఖ్జీందర్ సింగ్ రణ్ ధావా తాజాగా చేసిన కామెంట్సే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. అరూసా ఆలంకు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్ధ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయని రణ్ ధావా ఆరోపించారు. దీంతో దేశ ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని అరూసా ఆలంపై దర్యాప్తు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు.

ర‌ణ్ ధావా చేసిన వ్యాఖ్య‌ల‌తో ఒక్కసారిగా కలకలం రేగింది. ఐఎస్ఐతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఆరూసా ఆలంతో… అమరీందర్ సంబధాలపైనా విచారణ జరుపుతామని కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపింది. దీంతో అరూసా ఆలం వ్యవహారం ఇప్పుడు పంజాబ్ కాంగ్రెస్ ను కుదిపేసేలా కనిపిస్తోంది. మరోవైపు తనను కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేస్తుందని ముందే గ్రహించిన అమరీందర్ సింగ్ మౌనాన్ని ఆశ్ర‌యించారు. తాను పార్టీ పెడతానని చెప్పిన అమరీందర్.. ఆ పార్టీకి ఇంకా పేరు పెట్టలేదన్నారు. ఇప్పుడీ టాపిక్ రాజ‌కీయాల్లో హాట్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement