Friday, May 17, 2024

అక్టోబర్‌ 24న తెలంగాణలో ‘భారత్​ జోడో’.. 370 కిలోమీటర్లు సాగనున్న రాహుల్‌ పాదయాత్ర

హైెదరాబాద్‌, ఆంధ్రప్రభ : కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ చేపట్టే ‘ భారత్‌ జోడో ‘ పాదయాత్ర తెలంగాణలోకి అక్టోబర్‌ 24న ప్రవేశిస్తుంది. నారాయణపేట జిల్లా మక్తల్‌ నియోజక వర్గంలో కృష్ణ మండలం గూడవల్లూరు గ్రామంలోకి రాహుల్‌ పాదయాత్ర వస్తుంది. నాలుగు పార్లమెంట్‌ నియోజక వర్గాలు, 10 అసెంబ్లి నియోజక వర్గాల్లో కొనసాగే ఈ యాత్ర 13 రోజులు లేదా 15 రోజుల్లో ఉమ్మడి నిజాబాబాద్‌ జిల్లాలోని జుక్కల్‌ నియోజక వర్గంలో పాదయాత్ర ముగిసి మహారాష్ట్రలోకి వెళ్లుతుందని కేంద్ర మాజీ మంత్రి, భారత్‌ జోడో యాత్ర తెలంగాణ సమన్వయకర్త బలరామ్‌ నాయక్‌ తెలిపారు. ఈ పాదయాత్ర విషయంలో ఇప్పటికే రూట్‌మ్యాప్‌ పరిశీలన జరిగిందని, రాష్ట్రంలో 350 కిలోమీటర్ల నుంచి 370 కిలోమీటర్ల వరకు పాదయాత్ర ఉండే అవకాశం ఉందని బలరామ్‌నాయక్‌ వివరించారు. రాహుల్‌గాంధీ పాదయాత్రకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు సీనియర్లందరూ తెలంగాణలో రాహుల్‌పాదయాత్ర విజయవంతం కోసం కృషి చేస్తున్నారని, పార్టీ కేడర్‌ కూడా ఉత్సాహంగా ఉందని ఆయన చెప్పారు. దేశంలో విచ్ఛిన్నకర శక్తులు పెచ్చి పెరిగిపోతున్నాయని నాయక్‌ మండిపడ్డారు. దేశాన్ని కులం, మతం, ప్రాంతాల వారీగా విభజించి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నాయని ఆయన విమర్శించారు. కాగా, రాహుల్‌గాంధీ చేపట్టబోయే ‘ భారత్‌ జోడో ‘ పాదయాత్ర ఈ నెల 7న కన్యాకుమారిలో ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా 3,570 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించే రాహుల్‌గాంధీ 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలను కలుపుకుంటూ యాత్ర కొనసాగనుంది. కేరళ, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో 15 రోజుల నుంచి 20 రోజుల వరకు పాదయాత్ర ఉంటుంది, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మిగతా రాష్ట్రాల్లో ఒక్కో రాష్ట్రంలో ఐదు రోజుల పాటు రాహుల్‌ యాత్ర ఉంటుందని చెబుతున్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా యాత్రలో మార్పులు, చేర్పులు ఉంటాయని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రతి రాష్ట్రంలో యాత్ర ప్రారంభయ్యే చోట, ముగింపు ప్రాంతంలో భారీ సభలు నిర్వహించే అవకాశం ఉంది. పాదయాత్రలో భాగంగా ప్రతి చోట అన్ని వర్గాల ప్రజలను కలుసుకుని వారి సాధక, బాధలను తెలుసుకునేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.

రాహుల్‌ పాదయాత్రలో తెలంగాణ నుంచి ఆరుగురు.. ఏపీ నుంచి ఒకరికి అవకాశం..

సెప్టెంబర్‌ 7 నుంచి జరగనున్న రాహుల్‌గాంధీ చేపట్టబోయే పాదయాత్రలో తెలంగాణ నుంచి ఆరుగురు నేతలకు అవకాశం దక్కింది. 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల గుండా సాగనున్న ఈ యాత్రలో రాహుల్‌ వెంట నడిచేందుకు 117 మందిని ఏఐసీసీ ఎంపిక చేసింది. వీరిలో మూడు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌ ఒక్కో రోజు ఉంటుందని కాంగ్రెస్‌ నేతలు తెలిపారు. వీరికి రెండు రోజుల పాటు కన్యాకుమారిలో శిక్షణ ఇవ్వనున్నారు. యాత్రలో పాల్గొనే వారికి ఏఐసీసీ ఇంటర్యూలు కూడా నిర్వహించింది. తెలంగాణ నుంచి రాహుల్‌ పాదయాత్రకు ఎంపికైన వారిలో టీ పీసీసీ అధికార ప్రతినిధి బెల్లయ్యనాయక్‌, వెంకట్‌రెడ్డి, కేతూరి వెంకటేశ్‌, కత్తీ కార్తీక, బుసా అనులేఖ, కొల్కుండ సతీష్‌లు ఉన్నారు. ఏపీ నుంచి రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ నేత సుంకర పద్మశ్రీకి అవకాశం దక్కింది. పాదయాత్రలో పాల్గొనే ప్రతి ఒక్కురూ తెల్ల వస్త్రాలు మాత్రమే దరించాలని నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement