Friday, April 26, 2024

పరిహారం కోరుతున్న చమురు శాఖ.. 21,201 కోట్ల నష్టాల్లో ఆయిల్‌ కంపెనీలు

నష్టాల్లో ప్రభుత్వం రంగ చమురు కంపెనీలను ఆదుకునేందుకు ఆర్ధిక వెలుసుబాటు కల్పించాలని చమురు మంత్రిత్వ శాఖ అర్ధిక శాఖను కోరింది. 8 నెలలుగా చమురు కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ రేట్లను సవరించలేదు. ద్రవ్యోల్బణ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం కోరడంతో చమురు కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌(ఐఓసీ), భారత్‌ పెట్రోలియం కార్పోరేషన్‌ (బీపీసీఎల్‌), హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పోరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌) కంపెనీలకు ఏప్రిల్‌-సెప్టెంబర్‌ త్రైమాసికంలో 21,201.18 కోట్ల నష్టాలు వచ్చాయి.

ఈ కంపెనీలకు ఎల్‌పీజీ సబ్సిడీ కింద ప్రభుత్వం నుంచి 22 వేల కోట్లు రావాల్సి ఉంది. ఇది కూడా కలిపితే నష్టాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ద్రవ్యోల్బణ నియంత్రణలో భాగంగా చమురు కంపెనీలు రేట్లను పెంచనందున ఈ మేరకు ఆర్ధిక శాఖ పరిహారం ఇవ్వాలని చమురు మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. దీనిపై ఆర్ధిక మంత్రిత్వ శాఖకు పూర్తి వివరాలు ఇవ్వడానికి ముందే మొత్తం సంవత్సరానికి ఏ మేరకు నష్టాలు వచ్చేది అంచనాలు రూపొందించనున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ ఇంకా చమురు కంపెనీలు డీజిల్‌, పెట్రోల్‌ అమ్మకాలపై నష్టాలను ఎదుర్కొంటున్నాయి.

- Advertisement -

ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్‌ 6 నుంచి చమురు కంపెనీలు రేట్లను సవరించలేదు. ఆ సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కొద్ది రోజుల నుంచే వీటి ధరలు 90 డాలర్ల లోపుకు వచ్చాయి. 2020 జూన్‌ నుంచి ఎల్పీజీ ధరలును చమురు కంపెనీలు సవరించలేదు. దీంతో ఇటీవలే ప్రభుత్వం 22 వేల కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. చమురు మంత్రిత్వ శాఖ మాత్రం ఎల్పీజీ పరిహారం కింద 28 వేల కోట్లు ఇవ్వాలని కోరింది. అంతర్జాతీయ చమురు ధరలు తగ్గుతున్నందున దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు తగ్గుతాయని వినియోగదారులు కోరుతున్నారు. వాస్తవంలో మాత్రం ఇంకా చమురు కంపెనీలు నష్టాలను ఎదుర్కొంటున్నాయి. జూన్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌ 116 డాలర్లు ఉంటే, ప్రస్తుతం అది 83.23 డాలర్లుగా ఉంది.

అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా రోజువారి రేట్లను సవరించుకునే అధికారం చమురు కంపెనీలకు ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం కోరడంతో ఇవి వాటి రేట్లను సమరించడం లేదు. ఈ సంవత్సరం మేలో ప్రభుత్వం ద్రవ్యోల్బణ నియంత్రణలో భాగంగా పెట్రోల్‌, డీజిల్‌పై ఉన్న ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement