Monday, April 29, 2024

మద్యం దుకాణాల నోటిఫికేషన్‌ జారీ.. 18 వరకు దరఖాస్తుల గడువు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో మద్యం దుకాణాల కేటాయింపులు, లైసెన్సుల జారీ, దరఖాస్తులకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2620 మద్యం దుకాణాల కేటాయింపుకు ఈ నెల 3నుంచి జిల్లాల వారీగా నోటిఫికేషన్‌ జారీ చేసి 4నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆగష్టు 21న లాటరీలు తీసి దుకాణాలకు కేటాయిస్తారు. ఇప్పుడున్న మద్యం దుకాణాల గదువు నవంబర్‌ 31తో ముగియనుండగా, ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా దరఖాస్తుల ప్రక్రియను ముగించి లైసెన్సులను జారీ చేయాలని నిర్ణయించింది.

దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 18 సాయంత్రం 6గంటలతో ముగియనుంది. ఒక్కో దరఖాస్తుకు రూ. 2లక్షలను ప్రభుత్వం ఫీజుగా నిర్ణయించింది. లాటరీలలో లైసెన్సులను దక్కించికున్న వ్యాపారులు తొలి విడత ఎక్సైజ్‌ టాక్స్‌ను ఈ నెల 21నుంచి 22 వరకు చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్‌ 1నుంచి నూతన మద్యం దుకాణాలు అందుబాటులోకి వస్తాయి.

కాగా దరఖాస్తు రుసుములు, లైసెన్సు ఫీజుల విషయంలో గతంలో ఉన్న విధానాన్నే కొనసాగించనున్నారు. గతంలో రూ. 1350కోట్లు దరఖాస్తు ఫీజుల రూపంలోరాగా, ఈ ఏడాది ఎన్నికల నేపథ్యంలో ఎక్కువగా వస్తాయని భావిస్తున్నప్పటికీ డిసెంబర్‌లోగా ఎన్నికలు ముగుస్తాయనే అంచనాల నేపథ్యంలో పోటీపై రాబడి ఆధారపడి ఉండనున్నది. పాలసీ గడువు ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో బార్లు, ఏ 4(మద్యం దుకాణాల)కు కొత్తగా లైసెన్సులు జారీ చేయాల్సి ఉంది. అయితే బార్లకు కొత్తగా అనుమతులు ఇవ్వకపోయినా లైసెన్సు రుసుముల్లో మార్పులు తేనున్నట్లు తెలిసింది.

- Advertisement -

కొత్తగా టీఎస్‌బీసిఎల్‌ డిపోలు, వైనరీల ఏర్పాటు, పన్నులపౖౖె సవరణలకు అవకాశమున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కసరత్తులో భాగంగా రాష్ట్రంలో ధనికవర్గాలు సేవించే మద్యంపై పన్నులను తగ్గించేలా ముసాయిదాలో చేర్పులుండవచ్చని సమాచారం. ధనికవర్గాల మద్యం ప్రియులు, మహిళలు సేవించే రెడీ టూ డ్రింక్‌, వైన్‌లను మరింత ప్రోత్సహించేలా గత రెండేళ్లుగా ప్రభుత్వం కొంత కార్యాచరణ చేసింది. ఈ చర్యల్లో భాగంగా పన్ను రేటును తగ్గించడం, వ్యాపారుల మార్జిన్‌(లాభ శాతం) పెంచేందుకు యోచిస్తోంది.

రాష్ట్రంలో మద్యంపై పన్ను రేటు అధికం కావడంతో ధరలు పెరిగాయి. ఫలితంగా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లి, హర్యానా రాష్ట్రాలనుంచి వైన్‌ దిగుమతి అవుతోంది. దీంతో తెలంగాణలోనూ పన్ను రేటును తగ్గించాలని ఆబ్కారీ శాఖ ప్రభుత్వానికి నివేదికలు పంపింది. రాష్ట్రంలో పొరుగు స్టేట్‌లకంటే సుమారు 30శాతం మద్యం ధరలు ఎక్కువగా ఉన్నాయని, ఈ కారణంగానే నాన్‌ డ్యూటీ పెయిడ్‌తోపాటు, ఇతర మార్గాల్లో మద్యం తెలంగాణకు వస్తోందని అంటున్నారు. తాజాగా మద్యం విక్రయాలు తగ్గుముఖం పట్టడంతో ఎక్సైజ్‌ శాఖ ఆందోళనలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement