Saturday, May 11, 2024

Delhi | కాషాయ దళంలోకి సహజనటి..బీజేపీలో చేరిన జయసుధ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : క్రైస్తవులకు ప్రాతినిథ్యం వహిస్తానని, తన గళం గట్టిగా వినిపిస్తానని మాజీ ఎమ్మెల్యే, సహజనటి జయసుధ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం ఆమె న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి తరుణ్‌చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సమక్షంలో బీజేపీలో చేరారు. తరుణ్ చుగ్ ఆమెకు పార్టీ సభ్యత్వం అందించి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తరుణ్ చుగ్ మాట్లాడుతూ సినీ రంగంలో జయసుధ సాధించిన విజయాలను వివరించారు.

300 సినిమాల్లో నటించిన ఆమె, 2010 నుంచి 2014 వరకు ఎమ్మెల్యేగా సేవలందించారని చెప్పారు. 9 నంది అవార్డులతో పాటు 7 ఫిల్మ్‌ఫేర్, లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డులు అందుకున్నారని తరుణ్ చుగ్ గుర్తు చేశారు. అలాగే ఎమ్మెల్యేగా ఆమె పేదల అభివృద్ధికి కృషి చేశారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి జయసుధ పార్టీలో చేరారని తెలిపారు. బీజేపీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సేవలందిస్తారని ఆయన ఆకాంక్షించారు. 

- Advertisement -

అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ బాలనటిగా సినిమాల్లా నటించడం మొదలుపెట్టిన జయసుధ ఇటీవలే నటిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుని చెప్పారు. తెలుగు భాషలోనే కాకుండా కన్నడ, తమిళ్, మలయాళం ఇతర భాషల్లో కూడా నటించారని తెలిపారు. సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న జయసుధ, శాసన సభ్యురాలిగా కూడా ప్రజలకు సేవలందించి మన్ననలు పొందారని కిషన్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అదే సభలో తాను ఎమ్మెల్యేగా ఉన్నానని గుర్తు చేశారు.

పేదల పక్షాన, బస్తీవాసుల అభివృద్ధి కోసం పని చేసిన జయసుధ చేరికతో బీజేపీకి లాభం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీ శాఖ తరఫున ఆమెను సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నానన్నారు. కుటుంబ, అవినీతి పాలన, నియంతృత్వ పాలన పోయి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ ఓడిపోతేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలు భావిస్తున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. 

ఆ తర్వాత జయసుధ మాట్లాడుతూ… మోదీ నాయకత్వంలో దేశం చాలా అభివృద్ధి చెందిందన్నారు. తాను బీజేపీలో చేరటం చాలామందికి ఆశ్చర్యం కలిగించినా ఎప్పట్నుంచో అనుకుంటున్నానని తెలిపారు. హోంమంత్రి అమిత్ షాను కలిశానని ఆమె వెల్లడించారు. పని చేయాలనే ఉద్దేశంతోనే తాను బీజేపీలో చేరానని తెలిపారు.

తాను ఒక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నానని వెల్లడించారు. తాను అందరి మనిషినన్న జయసుధ, ఒక మతం, కులంపరంగా కాకుండా నటిగా జాతీయ పార్టీ ద్వారా మంచి పనులు చేయాలని బీజేపీలోకి వచ్చానని జయసుధ వివరించారు. తన పార్టీ మార్పు మంచి మార్పు, మంచి రోజుల కోసమని నమ్ముతున్నానన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement