Thursday, May 9, 2024

మద్ధతు పొందడమే కాదు, హామీలు నెరవేర్చాలి.. రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎంపీలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వంటి ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మద్ధతు పొందడమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విభజన హామీలు కూడా నెరవేర్చాలని అనకాపల్లి ఎంపీ డా. సత్యవతి అన్నారు. పార్లమెంటు భవనంలో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసిన అనంతరం ఆంధ్రప్రదేశ్ భవన్‌లోని గురజాడ కాన్ఫరెన్స్ హాలులో వైఎస్సార్సీపీ ఎంపీలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డా. సత్యవతి మాట్లాడుతూ.. తమ పార్టీకి చెందిన మొత్తం 30 మంది ఎంపీలు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఓటేశామని వెల్లడించారు. దేశం కోసం కృషి చేసిన వ్యక్తులకు సముచిత స్థానం లభిస్తుందనడానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థులే నిదర్శనమని ఆమె వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయాన్ని చేతల్లో అమలు చేసి చూపుతున్నారని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు. సోమవారం నుంచి ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలను ఉపయోగించుకుని రాష్ట్ర సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. అధికార కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగ్‌దీప్ ధన్కడ్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి వైఎస్సార్సీపీని ఆహ్వానించకపోవడం ‘కమ్యూనికేషన్ గ్యాప్’గా ఎంపీ సత్యవతి వివరించారు.

అత్యున్నత పదవిలో ఆదివాసీ మహిళ మాకు ఆదర్శం: గొడ్డేటి మాధవి..

రాజ్యాంగ అత్యున్నత పదవిని ఆదివాసీ మహిళకు ఇవ్వడం తమకు ఆదర్శమని వైఎస్సార్సీపీకి చెందిన అరకు ఎంపీ గొడ్డేటి మాధవి అన్నారు. గిరిజన మహిళను రాష్ట్రపతిని చేయడం సంతోషంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. ఏపీలో గిరిజనుల అభివృద్ధి కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. జగన్ మహిళా పక్షపాతి అన్నారు. గిరిజన మహిళలకు అవకాశం కల్పిస్తే ఎలా ఉంటారనేదానికి తామే నిదర్శమని ఆమె వ్యాఖ్యానించారు. జగన్ గర్వపడేలా ముందుకు నడుస్తామని తెలిపారు. గిరిజన మహిళకు రాష్ట్రపతి అభ్యర్ధిగా అవకాశం కల్పించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

పెద్దల సభలో ఓబీసీల గొంతుకై నిలుస్తా: బీద మస్తాన్ రావు..

వెనుకబడిన వర్గాల గొంతు వినిపించేందుకు తనను సీఎం జగన్మోహన్ రెడ్డి రాజ్యసభకు పంపించారని సోమవారం ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన బీద మస్తాన్ రావు అన్నారు. పెద్దల సభలో బీసీల గొంతుకై నిలుస్తానని అన్నారు. రాజశేఖర్ రెడ్డికి తగ్గ కొడుకుగా జగన్ ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నారని కొనియాడారు. ఎన్డీఏ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థులకు మద్దతివ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, ఆ ప్రకారం రాష్ట్రపతి ఎన్నికల్లో సంతోషంగా పాల్గొన్నామని ఆయన తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సంక్షేమం, అభ్యున్నతి కోసం జగన్ సర్కార్ పనిచేస్తోందని ఆయనన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement