Friday, April 26, 2024

తాండూరు రోడ్లకు కొత్త అందాలు.. రాత్రి..పగలు వేగంగా కొనసాగుతున్న రోడ్డు పనులు

(ప్రభ న్యూస్‌ ప్రతినిధి, వికారాబాద్‌) : కాలం కలిసి వస్తే ఏదైనా సాధ్యం అవుతుందనే నానుడికి ఇది చక్కటి ఉదాహరణ. జూన్‌ మొదటి నుంచి వర్షాకాలం ప్రారం భం అవుతుంది. ఈసారి కూడా మంచి వర్షాలు ఉంటాయని.. నైరుతీ రుతుపవనాలు కూడా ఆశించిన దాని కంటే ముందు గానే రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. వాస్తవానికి అలాంటిది జరగలేదు. జిల్లాలో నైరుతీ మొహం చాటేసింది. గత మూడు వారాల వ్యవధిలో ఒకే సారి మంచి వర్షం కురిసింది. మొదటి మూడు వారాలు జిల్లాలో వర్షాభావ పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి రైతులకు తీవ్ర ప్రతికూలం. అయితే రోడ్డు నిర్మాణ పనులకు ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకున్నారు. ఎలాంటి వర్షాలు లేకపోవడంతో రాత్రి.. పగలు పనులను చేపట్టారు. జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) అధికారుల పనితీరుకు ఇది నిదర్శనం. జిల్లాలోని తాండూరు పట్టణంలో భారీ వ్యయంతో నిర్మిస్తున్న రోడ్డు పనులు ఆకట్టుకుంటున్నాయి. ఈ దిశగా పర్యవేక్షణ చేసిన తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డికి, పనులను వేగంగా సాగిస్తున్న కాంట్రాక్టర్‌ పవన్‌ రెడ్డి(ఎస్‌ఎస్‌ఆర్‌ క్రస్ట్‌)ని తాండూరు ప్రాంత ప్రజలు ప్రశంసిస్తున్నారు.

జిల్లాలోని తాండూరు పట్టణంలో ఎన్‌హెచ్‌ఏఐ ఆధ్వర్యంలో రోడ్డు పనులను ప్రారంభించారు. మహబూబ్‌నగర్‌ శివారులోని బూత్పూర్‌ నుంచి కర్ణాటకలోని మన్నెకెళి వరకు ఉన్న 96 కిలోమీటర్ల రోడ్డు మార్గంను జాతీయ రహదారిగా మార్చి అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొదట ఈ మార్గం జిల్లాలోని కోడంగల్‌..తాండూరు పట్టణాల మధ్య నుంచి వెళుతుందని పేర్కొన్నారు. ఆతరువాత పట్టణాల మధ్య నుంచి కాకుండా బైపాస్‌లను నిర్మించాలని నిర్ణయించారు. దీంతో రెండు పట్టణాలలో ప్రస్తుతం ఉన్న రోడ్డు మార్గంను వన్‌ టైం బెటర్‌మెంట్‌(ఏటిబి) కింద ఎన్‌హెచ్‌ఏఐ అభివృద్ధి చేసి ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఇందుకు రూ.23 కోట్ల నిధులను కేటాయించగా పనులను ఎస్‌ఎస్‌ఆర్‌ క్రస్ట్‌ దక్కించుకుంది. అటు కోడంగల్‌..ఇటు తాండూరు పట్టణంలో ఉన్న ప్రధాన రోడ్డు మార్గాలను పూర్తిగా కొత్తగా నిర్మిస్తున్నారు. తాండూరు పట్టణంలో దాదాపు ఆరు కిలోమీటర్ల మేరకు రోడ్డును పునర్‌ నిర్మిస్తున్న పనులు జరుగుతున్నాయి. ఈ పనులను నెల క్రితం తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి ప్రారంభించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement