Sunday, May 5, 2024

కొత్త జిల్లాలకు కొత్త డీఈవోలు.. ఏడీ, డీవైఈవో క్యాడర్‌ అధికారులకు పదోన్నతులు..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో కొత్త జిల్లాల్లో పాలన సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆయా జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్డీవోల నియామకాలు పూర్తయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యాశాఖలో కొత్త జిల్లాల సందడి నెలకొంది. కొత్త జిల్లాలకు నియమితులయ్యే విద్యాశాఖాధికారులపై కసరత్తు ఒక కొలిక్కి వచ్చింది. ప్రస్తుతం డీఈవోలుగా పని చేస్తున్న సీనియర్లు కొత్త జిల్లాలకు వెళ్లేలా ఆప్షన్లు పెట్టుకునే అవకాశాన్ని ఇచ్చినట్లు తెలిసింది. మరోవైపు పాత జిల్లాలు సహా కొత్తగా ఏర్పాటవుతున్న జిల్లాలతో కలిపి మొత్తం 26 జిల్లాలకు విద్యాశాఖాధికారులను నియమించాల్సి ఉంది. అందుకోసం అసిస్టెంట్‌ డైరెక్టర్లు, డీవైఈవోలుగా పని చేస్తున్న అధికారుల్లో సీనియర్లను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో డీవైఈవో కార్యాలయాలనే డీఈవో ఆఫీసులుగా, కొన్ని చోట్ల కొత్త భవనాలను సిద్ధం చేశారు. అలాగే డీవైఈవోల ఈడీ డివిజన్‌ పరిధి అంతా ఒకే జిల్లాలో ఉండేట్లుగా త్వరలో పునర్వ్యవస్థీకరణ చేయనున్నట్లు సమాచారం.

మారని ఆర్జేడీ జోన్లు..

కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ కార్యాలయాల పెంపు అంశం తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతం 4 ఆర్జేడీ జోన్లు ఉన్నాయి. కడప, గుంటూరు, కాకినాడల్లో ఉన్న ఆర్జీడీ జోన్లకు అదనంగా 2019లో విశాఖపట్నం ఆర్జేడీ జోన్‌ను ఏర్పాటు చేశారు. దీంతో ఒక్కో జోన్‌ పరిధిలో 3 నుంచి నాలుగు జిల్లాల ఉంటాయి. తాజాగా జిల్లాల సంఖ్య 13 నుంచి 26కు చేరడంతో జోన్లను పెంచే ప్రతిపాదన చర్చకు వచ్చింది. అయితే ప్రస్తుతానికి అలాంటి యోచన ఏమీ ప్రభుత్వానికి లేదన్నట్లు సమాచారం. అయితే జిల్లాల విద్యాశాఖాధికారుల కార్యాలయాలు మాత్రం వెంటనే 26కు పెరగనున్నాయి.

పరీక్షలపై ఉండని ప్రభావం..

జిల్లాల పునర్వ్యస్థీకరణ నేపథ్యంలో త్వరలో జరగబోయే పదో తరగతి పరీక్షలపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు ఒక జిల్లాలో ఉన్న పాఠశాలలు సోమవారం నుంచి మరో జిల్లాలోకి మారతాయని, దీంతో ఏవైనా ఇబ్బందులు ఎదురవుతాయా అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పటికే షెడ్యూల్‌ విడుదల కావడంతో పది పరీక్షలు ప్రకటించిన కేంద్రాల్లోనే జరుగుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అలాగే మూల్యాంకనం అనంతరం ఇచ్చే మార్కుల మెమోల్లో కొత్త జిల్లాల పేర్లు వస్తాయని చెబుతున్నారు. దీని వల్ల విద్యార్థులకు, వారి పై చదువులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు.

- Advertisement -

బదిలీలు, పదోన్నతులు పాత జిల్లా స్థాయిలోనే?

13 జిల్లాల నుంచి 26 జిల్లాలుగా పెరుగుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు అంశం చర్చనీయాంశంగా మారుతోంది. అయితే ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌ వచ్చే వరకు టీచర్ల బదిలీలు, పదోన్నతులు పాత జిల్లా స్థాయిలోనే కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు.

కొత్త జిల్లాలకు ఇంచార్జి డీఈవోలుగా సీనియర్‌ ప్రధానోపాధ్యాయులను నియమించాలి: ఏపీ హెచ్‌ఎంఏ

ఉన్నత విద్యార్హతలు కలిగి అపార అనుభవం ఉన్న సీనియర్‌ ప్రధానోపాధ్యాయులను, మండల విద్యాశాఖ అధికారులను నూతనంగా ఏర్పడుతున్న కొత్త జిల్లాలకు ఇంచార్జ్‌ జిల్లా విద్యాశాఖాధికారులుగా, ఉప విద్యాశాఖ అధికారులుగా నియమించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రధానోపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జీవీ నారాయణరెడ్డి, వి. శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి డా. ఆదిమూలపు సురేష్‌కు రాసిన వినతిలో విద్యాశాఖ అధికారులు తమ కార్యాలయాల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందిని, బోధనతో కూడిన పర్యవేక్షణ పోస్టులైన ఉప విద్యాశాఖ అధికారులుగా నియమిస్తున్నారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వారికి పదోన్నతులు ఇస్తున్నారన్నారు. దశాబ్దాల బోధనానుభవం, ఉన్నత విద్యార్హతలు ఉన్నా ఉపాధ్యాయులు పదోన్నతులు లేకుండానే పదవీ విరమణ పొందుతున్నారని, కనుక ప్రత్యేక చొరవ తీసుకుని తమకు పదోన్నతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement