Saturday, April 27, 2024

Delhi | ఇలాంటి ప్రమాదం ఎప్పుడూ చూడలేదు : రాఘవయ్య

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఒడిశాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో లోకో పైలట్ తప్పిదమేమీ లేదని రైల్వే కార్మిక సంఘం ‘నేషనల్ ఫెడరేషన్ ఇండయన్ రైల్వేస్’ ప్రధాన కార్యదర్శి రాఘవయ్య అన్నారు. ఇలాంటి ప్రమాదాన్ని తాను తొలిసారిగా చూస్తున్నానని, మూడు రైళ్లు ప్రమాదానికి గురైన ఘటన తాను ఇదివరకు ఎప్పుడూ చూడలేదని అన్నారు. ప్రమాదం జరిగిన తీరును బట్టి చూస్తుంటే ఎక్స్‌ప్రెస్ రైళ్ల కోసం గూడ్స్ రైళ్లను లూప్ లైన్లో మళ్లించి లైన్ క్లియర్ చేశారని, సిగ్నల్ ప్రకారం మెయిన్ లైన్ మీదుగా కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ వెళ్లాల్సి ఉండగా అది కూడా లూప్‌లైన్‌లోకి వెళ్లడంతోనే ప్రమాదం చోటు చేసుకుందని విశ్లేషించారు.

ప్రమాదానికి గురైన తర్వాత కోరమాండల్ బోగీలు పక్కనే ఉన్న ట్రాక్ మీద చెల్లాచెదురుగా పడిపోయాయని, సరిగ్గా అదే సమయంలో మరోవైపు నుంచి యశ్వంతపూర్-హౌరా ఎక్స్‌ప్రెస్ రావడంతో అది కూడా ప్రమాదానికి గురైందని తెలిపారు. సాధారణంగా ఇలా జరగదని, ప్రతిరోజూ వేల సంఖ్యలో రైళ్లు నడిచే భారతీయ రైల్వేలో సిగ్నలింగ్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉందని ఆయనన్నారు. లోకో-పైలట్ తప్పిదం కూడా ఏమీ కనిపించడం లేదని.. సిగ్నల్ జంప్ చేసి రైలును ముందుకు తీసుకొచ్చినట్టు ఎక్కడా ఆనవాళ్లు లేవని అన్నారు.

- Advertisement -

మెయిన్ లైన్లో వెళ్లాల్సిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు లూప్ లైన్‌లోకి రావడం మిస్టరీగా ఉందని అన్నారు. దర్యాప్తు తర్వాతనే ఏం జరిగిందో తెలుస్తుందని అన్నారు. ఇకపోతే రైల్వేలో సిబ్బంది కొరత ఎక్కువగా ఉందని, ముఖ్యంగా రైల్వే భద్రతకు సంబంధించిన విభాగాల్లో ఈ కొరత మరింత ఎక్కువగా ఉందని అన్నారు. రైల్వే సామర్థ్యాన్ని, వేగాన్ని పెంచుకుంటూ వెళ్తున్న తరుణంలో అదే నిష్పత్తిలో సిబ్బంది సంఖ్యను కూడా భర్తీ చేయాల్సి ఉంటుందని అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement