Wednesday, May 15, 2024

మే 7న దేశవ్యాప్తంగా నీట్‌ పరీక్ష.. తెలుగులోనూ రాసే వెసులుబాటు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : జాతీయ స్థాయిలో వైద్య విద్య కోర్సులో ప్రవేశానికి నిర్వహించే నీట్‌ పరీక్ష మే 7న జరుగనుంది. అభ్యర్థుల దరఖాస్తుల గడువు ఈనెల 6న ముగిసింది. అయితే, పలు సమస్యల వల్ల సకాలంలో దరఖాస్తు చేసుకోలేకపోయామని అభ్యర్థులు చేసిన విజ్ఞప్తి మేరకు నేషనల్‌ టెస్టింగ్స్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) గడువును ఈనెల 13 వరకు పొడిగించింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు తమ అప్లికేషన్లలో పొరపాట్లను సవరించుకునేందుకు ఎన్టీఏ తాజాగా కరెక్షన్‌ విండోస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా మే 7న నీట్‌ పరీక్ష దేశవ్యాప్తంగా మొత్తం 499 నగరాలు, పట్టణాలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 వరకు జరుగుతుంది.

మొత్తం 13 భాషల్లో అభ్యర్థులు పరీక్ష రాసేందుకు వీలు కల్పించారు. తెలుగులోనూ నీట్‌ రాసే వెసులుబాటు కల్పించారు. పెన్ను, పేపర్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. నీట్‌ పరీక్ష రాసే అభ్యర్థులు హాల్‌ టికెట్లు, పరీక్షా కేంద్రాల సమాచారం ఎన్టీఏ వెబ్‌ సైట్‌లో తెలుసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఇదిలా ఉండగా, తెలంగాణ నుంచి ఈ ఏడాది నీట్‌ పరీక్ష రాసే అభ్యర్థుల సంఖ్య భారీగా పెరిగింది. గత ఏడాది ఈ 30 లక్షల మంది అభ్యర్థులు నీట్‌ పరీక్ష రాయగా, ఈ ఏడాది ఆ సంఖ్య 50 లక్షలకు చేరనుందని అంచనా.

2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి నీట్‌ పరీక్ష ద్వారా ఎంబీబీఎస్‌, డెంటల్‌, ఆయుర్వేదం, యునాని, హోమియోపతి, అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, ఫిషరీస్‌, కమ్యూనిటీ సైన్స్‌, పారామెడికల్‌, నర్సింగ్‌ కోర్సులకు బీఎస్సీ అల్లైడ్‌ కోర్సు, ఫిజియోథెరపీ కోర్సుల కోసం అడ్మిషన్లు జరుగుతాయి. నీట్‌ పరీక్షలో కట్‌ ఆఫ్‌ మార్కులతో అర్హత సాధించిన అభ్యర్థుులు అడ్మిషన్‌కు అర్హులు. నీట్‌ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా కౌన్సెలింగ్‌కు పిలుస్తారు.

రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ అనంతరం మూడు రౌండ్లలో కౌన్సిలింగ్‌ ప్రక్రియను పూర్తి చేసి సీట్లు కేటాయిస్తారు. 15 శాతం ఆలిండియా కోటా, 85 శాతం రాష్ట్ర కోటా సీట్ల ఆధారంగా ప్రభుత్వ కళాశాలల్లో చేర్చుకుంటారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లను భర్తీ చేసే వరకు ఎన్టీఏ కౌన్సిలింగ్‌ ప్రక్రియను కొనసాగిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement