Saturday, April 27, 2024

రాజకీయాల్లోకి సినీ నిర్మాత దిల్‌ రాజు.. పీసీసీ చీఫ్‌ రేవంత్‌తో భేటీ ?

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: తెలంగాణకు చెందిన ప్రముఖ సినీ నిర్మాత, పంపిణీదారుడు వెలమకుంచ వెంకట రమణా రెడ్డి (దిల్‌ రాజు) రాజకీయ రంగప్రవేశం చేయాలని నిర్ణయించుకున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలతో సత్సంబంధాలున్న దిల్‌ రాజు వచ్చే అసెంబ్లీ లేదా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉవ్విళూరుతున్నట్టు సమాచారం. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించి బ్లాక్‌ బస్టర్‌ సినిమాలను నిర్మిస్తున్న దిల్‌ రాజు రాజకీయాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలన్న భావనతో ఉన్నట్టు తెలుస్తోంది. స్టార్‌ హీరోలతో సినిమాలు.. కోట్ల బడ్జెట్‌ పెడుతూ పాన్‌ ఇండియా సినిమాలను దిల్‌ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దిల్‌ రాజు కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకోడానికి ముహూర్తం నిర్ణయించుకున్నట్టు కూడా సినీ రంగంలో ప్రచారం జోరందుకుంది.

- Advertisement -

ఈ ప్రచారం జరగడానికి కారణం కూడా లేకపోలేదంటున్నారు. ఇటీవల దిల్‌ రాజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డితో భేటీ అయ్యారని రాజకీయ రంగప్రవేశంపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించుకున్నారని సమాచారం. నిజామాబాద్‌ జిల్లాలో రేవంత్‌ హాత్‌ సే హత్‌ జోడో యాత్రలో భాగంగా రేవంత్‌ నాలుగు రోజుల పాటు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో పర్యటించారు. ఇదే జిల్లాకు చెందిన దిల్‌ రాజు రేవంత్‌ రెడ్డిని కలిశారని చెబుతున్నారు. దిల్‌ రాజు.. తన స్వగ్రామమైన నర్సింగ్‌పల్లిలో ఆయన ఖర్చుతో నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయానికి రేవంత్‌ రెడ్డిని ప్రత్యేకంగా ఆహ్వానించడమే కాకుండా ఆయనతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి విదితమే.

దీంతో దిల్‌ రాజు.. రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. కాంగ్రెస్‌ పార్టీలో చేరాలన్న రేవంత్‌ పిలుపునకు ఆయన సుముఖత వ్యక్తం చేసినట్టు ఆ పార్టీ కీలక నేత ఒకరు చెప్పారు. ఇక ఈ మధ్య బలగం సినిమాతో కేటీఆర్‌ లాంటి వారినే మెప్పించిన దిల్‌ రాజు.. ఇప్పుడు రేవంత్‌ రెడ్డితో చనువుగా ఉండడం చర్చకు దారి తీసింది. నిజామాబాద్‌ లోక్‌సభ లేదా నిజామాబాద్‌ అర్బన్‌ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీకి దింపాలన్న యోచనలో రేవంత్‌ ఉన్నట్టు ఆ నేత వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement