Saturday, July 27, 2024

Delhi | విశాఖలో ప‌గ‌టిపూట మ‌రిన్ని విమానాలు.. రాజేశ్ పెందార్కర్, జీవీఎల్ మంత‌నాలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: విశాఖపట్నం విమానాశ్రయం రన్ వే పునరుద్ధరణ పనుల కారణంగా రాత్రివేళ విమానాల రాకపోకలను నిలిపేయనున్న నేపథ్యంలో పగటిపూట మరిన్ని సర్వీసులు నడిపేందుకు వీలు కల్పిస్తామని తూర్పు నావికాదళం చీఫ్ రాజేశ్ పెందార్కర్ తెలిపారు. నవంబర్ 15 నుంచి రాత్రిపూట విమానయాన సేవలను నిలిపేసి రన్ వే పునరుద్ధరణ చేపట్టనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మూసివేసే సమయాన్ని తగ్గించి, పగటిపూట మరిన్ని అదనపు సర్వీసులు నడిపేందుకు వీలు కల్పించాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు రక్షణశాఖ ఉన్నతాధికారులను కోరారు.

నెల రోజుల క్రితం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమానెతో సమావేశమైన జీవీఎల్, రాత్రిపూట విమానాశ్రయం మూసివేత సమయాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. తాజాగా ఈస్టర్న్ నావల్ కమాండ్ వైస్ అడ్మిరల్ పెందార్కర్‌తో సమావేశమైన జీవీఎల్, ఈ అంశం గురించి ఆరా తీశారు. రన్ వే మరమ్మతు పనుల కోసం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మూసివేయాలని అధికారులు నిర్ణయించగా.. ఆ సమయాన్ని తగ్గించగలరా అని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగారు. మరిన్ని విమానాల సర్వీసులకు వీలుకల్పించేలా రన్‌వేను మూసివేసే వ్యవధిని తగ్గించాలని కోరారు.

అయితే రన్‌వే క్యూరింగ్ కోసం ప్రకటించిన మూసివేత వ్యవధి కచ్చితంగా అవసరమని తూర్పు నావికాదళం అధిపతి తెలియజేశారు. ప్రయాణీకుల భద్రత దృష్ట్యా ఈ సమయాన్ని తగ్గించడం సాధ్యం కాదని, తగ్గించడం మంచిది కాదని కూడా ఆయన వివరించారు. ఇతర రక్షణ విమానాశ్రయాల కంటే విశాఖపట్నం విమానాశ్రయంలో పునరుద్ధరణ కార్యకలాపాలు ఎందుకు ఎక్కువ సమయం తీసుకుంటున్నాయని అడిగిన ప్రశ్నకు, విశాఖపట్నం ఎయిర్‌ఫీల్డ్‌కు ఇతర పెద్ద విమానాశ్రయాల మాదిరిగా సమాంతర టాక్సీ ట్రాక్ లేదని, దీని వల్ల విశాఖపట్నం విమానాశ్రయంలో కార్యకలాపాలకు ఎక్కువ సమయం పడుతుందని పేర్కొన్నారు.

రన్ వే మరమ్మతు పనుల నేపథ్యంలో మూడు విమాన సర్వీసులు రద్దయ్యాయని, వాటిని రద్దు చేసే బదులుగా పగటిపూట నడిపేలా టైమ్ స్లాట్ కేటాయించాలని జీవీఎల్ సూచించారు. పగటి పూట ఆ విమానాలు నడిపేందుకు టైమ్ స్లాట్లు అందుబాటులో ఉన్నాయని, అయితే అందుకు తగ్గట్టుగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)లో అదనపు సిబ్బందిని మోహరించాల్సి ఉంటుందని తూర్పు నావికాదళం చీఫ్ తెలిపారు. ఆయనతో చర్చానంతరం ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ,  మూసివేసే సమయం, వ్యవధిలో ఎలాంటి జాప్యాలు, అంతరాయాలు ఉండవని తెలిపారు. పదేళ్ల క్రితం పునరుద్ధరణ పనులు జరిగాయని, ప్రస్తుతం ప్రయాణీకుల భద్రతతో పాటు రక్షణ కార్యకలాపాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మరమ్మతు చేపట్టక తప్పదని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement