Friday, April 26, 2024

Minister Fishing | మంత్రి ఎర్రబెల్లి చేపల వేట.. జాలర్లతో మాటామంతి..

మహబూబాబాద్ : ప్రజల్లో, వారు చేసే పనుల్లో కలిసిపోవడం ఎవరైనా మంత్రి ఎర్రబెల్లి తర్వాతే. జనంతో మమేకం అవడం మంత్రి ఎర్రబెల్లికే చెల్లింది. సందర్భం వస్తే చాలు.. ఏదో ఒక విధంగా అందరినీ ఆశ్చర్య పరిచే విధంగా దయన్న ప్రవర్తన ఉంటుంది. అదంతా అలా అలవోకగా జరిగిపోతుంది. ఇలాంటి ఒక సందర్భం, సన్నివేశం ఈ రోజు ఆవిష్కృతం అయింది. జాలర్లతో కలిసి చేపలు పట్టి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అబ్బురపరిచారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా గురువారం చెరువుల పండుగ గ్రామాల్లో ఘనంగా జరుగుతున్నది. ఈ పండుగ కార్యక్రమాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొంటూ వస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని సోమవారం గుర్తూరు తదితర గ్రామాల్లో జరుగుతున్న చెరువుల పండుగ కార్యక్రమాల్లో గంగమ్మ తల్లికి పూజలు చేస్తూ, బతుకమ్మలని చెరువుల్లో వదులుతూ, కట్టమైసమ్మల దగ్గర పూజలు నిర్వహిస్తూ, ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ విందు, వినోదాల్లో పాల్గొంటూ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

పెద్ద వంగర మండలం గంట్ల కుంట గ్రామ సమీపంలోకి రాగానే ఈ రోజు మృగశిర కావడంతో కుంట కట్ట చెరువు వద్ద చేపలు పడుతున్న జాలర్లు మంత్రి కంటపడ్డారు. వెంటనే తాను ప్రయాణిస్తున్న కాన్వాయ్ ని ఆపి వారితో ముచ్చట్లు పెట్టారు. చేపలు పడ్డాయా? అంటూ ఆరా తీశారు. ఇప్పుడే పడుతున్నాం అని వారు చెప్పడంతో తాను కూడా చేపలు పట్టడానికి ఉపక్రమించారు. వేసుకున్న ప్యాంటును పైకి లాగి, నేరుగా చెరువులోకి దిగారు. ఆశ్చర్యపోయిన జాలర్లు మంత్రిని, స్వాగతించారు. వలను ఒకవైపు మంత్రికి అందించారు. మరో వైపు జాలర్లు వలను పట్టుకున్నారు. అంతా కలిసి వల విసిరి చేపలు పట్టారు. అందులో పడ్డ చిన్నచిన్న, కాస్త పెద్ద చేపల్ని చూసి సంబురపడ్డారు. ఇంకా పెద్ద చేపలు లేవా? అని అడిగారు. వారు దానికి సమాదానంగా ఉన్నాయి కానీ ప్రస్తుతానికి ఇవే పడ్డాయి.. అని తెలియజేశారు. అలాగే ఒకటికి రెండుసార్లు అలా వల విసిరి చేపలు పట్టి కొద్దిసేపు వాళ్లతో గడిపి ముచ్చట్లు పెట్టారు. చేపలు ఉచితంగా వస్తున్నాయా? చేపలు పెద్దగా అవుతున్నాయా? చేపల ద్వారా వారి ఆదాయ మార్గం ఎలా ఉంది? వంటి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం నీటితో చెరువులను నింపి, ఆ నీటిలో ఉచితంగా చేపలు వేసి, జాలర్లకు చేపలు పట్టుకునే అవకాశం కల్పించడమే కాక, ఆదాయ మార్గాన్ని చూపించిందని మంత్రి వారికి చెప్పారు. చెరువులు ఒకప్పుడు ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడ్డాయో, తిరిగి వాటిని బాగు చేసి అదే తరహాలో ప్రజలకు ఉపయోగ0లోకి సీఎం కేసీఆర్ తెచ్చారని, ఇవాళ చెరువులు ప్రజలకు ఆదెరువుగా మారాయని మంత్రి తెలిపారు. ఇదంతా సీఎం కేసీఆర్ దయవల్ల, కృషి వల్ల జరుగుతుందని చెప్పారు. తెలంగాణకు పూర్వవైభవం తెచ్చి అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిపిన సీఎం కేసీఆర్ కి అండగా ఉండాలని వారిని కోరారు. అక్కడి నుంచి మరో కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉపక్రమించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement