Saturday, May 11, 2024

Big Story | జేడీయూ, ఆర్జేడీ విలీనం?.. బీజేపీకి చెక్‌ పెట్టే వ్యూహాలకు పదును

2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీహార్‌ రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీకి చెక్‌ పెట్టే లక్ష్యంతో జేడీయూ చీఫ్‌ నితీశ్‌ కుమార్‌ వ్యూహాలకు పదును పెడుతున్నట్లు తెలుస్తోంది. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ భారతీయ జనతాపార్టీని గద్దె దించడమే లక్ష్యమని ఇప్పటికే అనేక వేదికలపై నితీశ్‌ స్పష్టంచేశారు. పైగా 2025 ఎన్నికల్లో కూటమికి ఆర్జేడీ చీఫ్‌, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌ సారథ్యం వహిస్తారని చెప్పడం ద్వారా కొత్త చర్చకు తెరలేపారు. జేడీయూ, ఆర్జేడీ విలీనం గురించి తరచూ జరుగుతున్న చర్చకు ఈ వ్యాఖ్యలు మరింత బలాన్నిచ్చాయి. దీంతో ఈరెండు పార్టీల విలీనం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. బీజేపీతో బంధాన్ని తెంచేసుకుని ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, బీజేపీకి వ్యతిరేకంగా నితీశ్‌ దూకుడు పెంచారు.

జాతీయ స్థాయిలోనూ మోడీని గద్దె దించేందుకు విపక్షాలను ఏకంచేసే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ విలీనం దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్‌లో న్యూఢిల్లిdలో ఆర్జేడీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో పార్టీ పేరు, గుర్తు మార్చే అధికారం లాలూకు, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌కు కట్టబెడుతూ తీర్మానం చేశారు. లాలూ విశ్వసనీయ సహాయకుడు భోలా యాదవ్‌ ప్రతిపాదించిన తీర్మానం అప్పట్లోనే విలీన ఊహాగానాలకు బీజం వేసింది. నవంబర్‌లో బీజేపీ సీనియర్‌ నేత సుశీల్‌ మోడీ కూడా జేడీయు-ఆర్జేడీ విలీనం ఉంటుందని పేర్కొన్నారు. ఈ పరిణామ క్రమాలన్నిటినీ విశ్లేషిస్తే, తెరవెనుక భారీ వ్యూహానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని, ఇది రెండు పార్టీల విలీనానికి దారితీయొచ్చనే బలమైన సంకేతాలన ఇస్తున్నది. ఇప్పుడు జేడీయూ-ఆర్జేడీ విలీనం జరిగితే, లోక్‌సభ ఎన్నికలకు ముందు నితీశ్‌ కుమార్‌ దాని నాయకుడిగా ఎదగవచ్చు. బీహార్‌లో తేజస్వీ యాదవ్‌ ప్రభుత్వాన్ని నడిపించే అవకాశం ఉంది.

ఆత్మహత్యా సదృశమే : కుష్వాహా
సీఎం నితీశ్‌ కుమార్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు బీహార్‌ రాజకీయాలతోపాటు, ఆయన సొంతపార్టీ అయిన జేడీయూలోనూ ప్రకంపనలు రేకెత్తిస్తున్నది. ఆర్జేడీలో జేడీయూ విలీనాన్ని నితీశ్‌ పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు. అలాంటిదేమీ లేదంటున్నారు. ఇదంతా మీడియా ప్రచారమేనని, బీజేపీ కుట్రలో భాగమేనని ఆరోపిస్తున్నారు. జేడీయూ నాయకుడు ఉపేంద్ర కుష్వాహా మాట్లాడుతూ, ఆర్జేడీతో విలీనానికి ఎంతమాత్రం అవకాశం లేదని తేల్చిచెప్పారు. రెండు పార్టీలను విలీనం చేయడం ఆత్మహత్య సదృశమే అవుతుందని నొక్కిచెప్పారు. ఇలాంటి ఊహాగానాలకు, తప్పుదోవ పట్టించే వార్తలకు ప్రజలు దూరంగా ఉండాలని కోరారు. కాగా, నితీశ్‌ వ్యాఖ్యలపై బీజేపీ నేత సుశీల్‌ మోడీ మాట్లాడుతూ, జేడీయూ నేతలు ఆర్జేడీలోకి ఫిరాయిస్తారనే భయంతోనే విలీనాన్ని ముందుకు తెచ్చారని చెప్పారు. ముఖ్యంగా ఆర్జేడీతో తిరిగి పొత్తు పెట్టుకున్న తర్వాత, జేడీయూ ఎమ్మెల్యేలు తేజస్వీ చెంతకు చేరేందుకు వేచిచూస్తున్నారని పేర్కొన్నారు.

ఒక గూటి పక్షులే..
బీహార్‌లో 2005 అసెంబ్లి ఎన్నికలు 15 ఏళ్ల లాలూ-రబ్రీ పాలనకు ముగింపు పలికాయి. ఆర్జేడీతో తెగదెంపులు చేసుకుని, లాలూకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన నితీశ్‌ కుమార్‌ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ, 2013లో బీజేపీని పక్కనబెట్టిన నితీశ్‌ ఆర్జేడీతో చేతులు కలిపారు. 2017లో ఆర్జేడీని కాదనుకుని బీజేపీతో జతకట్టారు. మళ్లిd 2022లో ఆర్జేడీతో చెట్టపట్టాల్‌ వేశారు. నిజానికి ఈ రెండు పార్టీలు కాంగ్రెస్‌ వ్యతిరేక శక్తుల సమష్టి శక్తి అయిన జనతాదళ్‌కి చెందినవి. జనతాదళ్‌లో చీలికల తర్వాత యూపీలో సమాజ్‌వాది పార్టీ ఆవిర్భవించింది. హర్యానా, కర్ణాటక, ఒడిశాలలో జేడీయూ చీలిక వర్గాలు కొత్త పార్టీలుగా పురుడు పోసుకున్నాయి. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ 1997 నుంచి ఆర్జేడీకి ఒక రూపం ఇచ్చారు. అయితే, అక్టోబర్‌ 2003లో శరద్‌ యాదవ్‌కి చెందిన జనతాదళ్‌వర్గం, జార్జి ఫెర్నాండెజ్‌కి చెందిన సమతాపార్టీ విలీనంతో జేడీ(యు) ఏర్పాటైంది. ఇందులో నితీశ్‌ కూడా భాగమయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement