Saturday, May 18, 2024

Delhi | పొరుగు రాష్ట్రాలపై కేసీఆర్ నజర్.. ఢిల్లీలో ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలతో భేటీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారత రాష్ట్ర సమితి జాతీయ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆ పార్టీ అధినేత కే. చంద్రశేఖర రావు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. గురువారం ఇరుగు పొరుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులతో సమావేశమైనట్టు తెలిసింది. పార్టీని జాతీయస్థాయిలో విస్తరించే క్రమంలో ఆయా రాష్ట్రాల్లో పరిస్థితుల గురించి తెలుసుకుని, ఎక్కడికి తగిన ప్రణాళిక అక్కడ రచించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలిసింది. తెలంగాణకు ఆనుకున్న కర్నాటక ఉత్తర భాగంలో ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలు, ఆహారపుటలవాట్లు, భౌగోళిక-వాతావరణ పరిస్థితులు ఒకేలా ఉన్నందున పార్టీ విస్తరణ పనులను ఆ ప్రాంతంతో మొదలుపెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

పైగా తెలంగాణ సరిహద్దుల్లోని కర్నాటక గ్రామాల ప్రజలు రెండు రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలు, అందిస్తున్న సంక్షేమ ఫలాల విషయంలో తేడాలను స్పష్టంగా గమనిస్తున్నారు. కొన్ని చోట్ల తమ గ్రామాలను తెలంగాణలో కలపాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తెలంగాణలో అమలవుతున్న తరహాలో రైతు బంధు, ఉచిత విద్యుత్తు సహా ఇతర సంక్షేమ ఫలాలను అందించాలని ప్రజలు స్థానిక ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. ఈ పోలిక ఆ రాష్ట్రంలో అడుగుపెట్టడానికి దోహదపడుతుందని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలిసింది.

కర్నాటకలోని దక్షిణ ప్రాంతంలో పట్టున్న జేడీ(ఎస్)తో కలిసి ఆ రాష్ట్రంలో పోటీచేయాలని ప్రణాళికలు రచిస్తున్న కేసీఆర్, జేడీ(ఎస్)కు పెద్దగా పట్టులేని ఉత్తర కర్నాటకలో పార్టీని విస్తరించడం కోసం అక్కడ వేర్వేరు పార్టీల్లోని బలమైన నేతలను బీఆర్ఎస్‌లో చేర్చుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే కర్నాటకకు చెందిన కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సహా మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా కేసీఆర్‌తో జరిగిన భేటీకి హాజరైనట్టు బీఆర్ఎస్ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

- Advertisement -

పెళ్లి కార్డుతో ఓవైసీ
గురువారం మధ్యాహ్నం తర్వాత సీఎం కేసీఆర్‌ను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వచ్చి కలిశారు. ఢిల్లీలోని కేసీఆర్ అధికారిక నివాసం 23, తుగ్లక్ రోడ్‌ నివాసంలో ఈ భేటీ జరిగింది. బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవం, జాతీయస్థాయి విస్తరణ కోసం చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ ప్రయత్నాలకు ఓవైసీ శుభాకాంక్షలు తెలిపినట్టు సమాచారం. అయితే భేటీ అనంతరం ఓవైసీ మీడియాతో మాట్లాడుతూ తన కుమార్తె వివాహానికి ఆహ్వానించడం కోసమే కేసీఆర్ ను కలిసినట్టు తెలిపారు. ఈ మేరకు పెళ్లికార్డును కేసీఆర్‌కు అందజేస్తున్న ఫొటోను విడుదల చేశారు.

నేతలు, కార్యకర్తలతో కోలాహలం
తెలంగాణ సీఎం నివాసం గులాబీ రంగు దుస్తులతో కోలాహలంగా మారింది. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం కోసం తెలంగాణ నలుమూలల నుంచి వచ్చి పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో పాటు ప్రజా సంఘాల నేతలు, రైతు సంఘాల నేతలు గురువారం కేసీఆర్‌ను కలిశారు. ఉదయం నుంచి రాత్రి వరకు కేసీఆర్ ను కలిసే సందర్శకులతో ఆయన నివాసంలో సందడి నెలకొంది. పార్టీ కార్యాలయం ప్రారంభించిన వెంటనే పార్టీ అనుబంధ విభాగంగా కిసాన్ సెల్ ఏర్పాటు చేసిన కేసీఆర్, గురువారం మరికొందరు రైతు సంఘాల నేతలతో చర్చలు జరిపారు.

దీని కంటే ముందే బీఆర్ఎస్ రైతు నేతలు వివిధ రైతు సంఘాల నేతలతో సమావేశమై తెలంగాణలో అమలవుతున్న రైతు అనుకూల పథకాల గురించి వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్న పరిస్థితులు, కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో సాధించిన పురోగతి, పెరిగిన సాగు విస్తీర్ణం, రికార్డు స్థాయిలో పెరిగిన పంట దిగుబడుల గురించి సవివరంగా గణాంకాలతో సహా తెలియజేశారు. గతంలో అనేక వేదికలపై కేసీఆర్‌తో పాటు కూర్చున్న భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయత్ కూడా ఈ అంశాల గురించి ఉత్తరాదిన విస్తృతంగా ప్రచారం చేశారు. దీనికి తోడు రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు కేసీఆర్ ఆర్థిక సహాయాన్ని అందజేయడం కూడా మరింత కలిసొచ్చింది. ఈ క్రమంలో గురువారం పలు రైతు సంఘాల నేతలు కేసీఆర్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపినట్టు తెలిసింది.

ఇదిలా ఉంటే పార్టీకి చెందిన నేతలు పలువురు కేసీఆర్‌ను కలిసి ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. హైదరాబాద్‌లో ఉంటే తమ పార్టీ అధినేతను కలవడం అంత సులభం కాదని, ఢిల్లీలో కలవడానికి వీలుపడుతుందన్న ఉద్దేశంలో పలువురు నేతలు గురువారం తమ తిరుగు ప్రయాణాలను రద్దు చేసుకుని మరీ కేసీఆర్‌ను కలిసేందుకు పోటీపడ్డారు. కలవలేకపోయినవారు శుక్ర, శనివారాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామని ఎదురుచూస్తున్నారు. మరో రెండ్రోజులు ఢిల్లీలోనే ఉండనున్న కేసీఆర్, పార్టీని విస్తరించే కసరత్తులోనే నిమగ్నమవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement