Thursday, May 2, 2024

మొసలిని మనువాడిన మేయర్‌! 230 ఏళ్ల ఆచారం పాటించిన ప్రజాప్రతినిధి

కప్పలు.. మేకలు, గాడిదలు… చివరకు చెట్టూపుట్టతోనూ వివాహం చేసుకునే సంప్రదాయం చాలా దేశాల్లో ఉంది. నిజమైన వివాహం చేసుకుంటే ఎదురయ్యే కష్టనష్టాల, ప్రాణగండాల నివారణ కోసం ఇలా ఉత్తుత్తి పెళ్లి జరపడం ఓ పరిహార ప్రక్రియగా భావిస్తారు. ఈ తంతు పూర్తయ్యాక అసలు వివాహం చేసుకోవడం ఆనవాయితీ. మన దేశంలోనూ ఇలాంటి నమ్మకాలు, ఆచారాలు ఉన్నాయి. అయితే, మెక్సికోలోనూ ఇలాంటి ఆచారమే ఉంది. మొసలిని వివాహమాడితే వ్యక్తిగతంగాను, ప్రజలకు, సమాజానికి అదృష్టం తలపుతడుతుందన్నది అక్కడి ఓ గిరిజన తెగ విశ్వాసం. ఆ సంప్రదాయంలో భాగంగానే దక్షిణ మెక్సికోలోని శాన్‌ పెడ్రో హువామెలుల నగర మేయర్‌ విక్టర్‌ హుగో సొసా, అలిసియా అద్రియానా అనే ఓ ఆడ మొసలిని వివాహమాడాడు.

- Advertisement -

ఆ గిరిజన తెగలో 230 సంవత్సరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని ఆయన అనుసరించారు. ఛోంతల్‌ (వరుడి తరపు తెగ), హువావే (వధువు తరపు తెగ) గిరిజిన తెగల మధ్య శాంతిసామరస్యాలు, అభివృద్ధికోసం ఇలా మకర-మానవ వివాహం చేయడం సంప్రదాయం. పైగా అదేదో మొక్కుబడి వ్యవహారంగా వివాహం జరపలేదు. సాక్షాత్తు వరుడు.. ఆ వధువు (మొసలి)ని యువరాణి (ప్రిన్సెస్‌ గర్ల్‌) గా వర్ణిస్తూ.. ఎంతో ప్రేమతో వివాహమాడుతున్నట్లు ప్రకటించడం విశేషం.

ఛోంతల్‌ తెగకు చెందిన రాజుగా వస్త్రాలు ధరించిన మేయర్‌ విక్టర్‌, బంధువులు ఇచ్చిన మొసలిని తన చేతుల్లోకి తీసుకుని ముద్దాడడంతో వివాహ తంతు ముగిసింది. మంచి వర్షాలు పడాలని, అధిక దిగుబడినిచ్చేలా పంటలు పండాలని, శాంతి సామరస్యాలు వెల్లివిరియాలని రెండు తెగలకు చెందిన పెద్దలు, పెళ్లి పెద్ద జైమే జరాటే వధూవరులిద్దరినీ ఆశీర్వదించడం కొసమెరుపు. వివాహానికి ముందు దానిని అందంగా అలంకరించి ప్రతీ ఇంటికీ తీసుకువెళ్లి ఆటలాడారు. అయితే, ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి… వధువు మొసలి కదా..! ఆకలేస్తే చప్పున ఎవరినైనా లాక్కుపోతుందేమోనన్న భయం అందరిలోనూ ఉంది. అందుకని వివాహ తంతు ముగిసేవరకు దాని నోటిని బంధించారు మరి! పెళ్లికన్నా ప్రాణం ముఖ్యం కదా!

Advertisement

తాజా వార్తలు

Advertisement