Wednesday, May 1, 2024

ప్రధానితో అపాయింట్మెంట్ ఇప్పించండి.. జీవీఎల్‌కు బీసీ సంఘాల రిక్వెస్ట్‌

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశంలో వెనుకబడిన వర్గాల హక్కులు, సంక్షేమం కోసం పోరాడుతున్న బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక నేత ఆర్. కృష్ణయ్య ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఆ సంఘం జాతీయ అధికార ప్రతినిధి కర్రి వేణుమాధవ్ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావును కలిసి విజ్ఞప్తి చేశారు. నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ (ఎన్సీబీసీ)కు రాజ్యాంగబద్ధత కల్పించడంతో పాటు ముద్ర రుణాల్లో చేతి వృత్తులపై ఆధారపడ్డ 54 శాతం మంది బీసీ కుటుంబాలకు అందేలా చర్యలు తీసుకున్న ప్రధాన మంత్రికి తామంతా కృతజ్ఞతతో ఉన్నామని కర్రి వేణుమాధవ్ తెలిపారు. వీటితో పాటు చట్టసభల్లోనూ బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించేలా రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును ప్రవేశపెట్టాలని తాము చేస్తున్న డిమాండు గురించి ప్రధానినే కలిసి మాట్లాడాలనుకుంటున్నట్టు కర్రి వేణుమాధవ్ తెలిపారు.

స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా బీసీల్లో ఇప్పటికీ 90 శాతం కులాలకు చట్టసభల్లో ఎలాంటి ప్రాతినిధ్యం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై అన్ని పార్టీల్లోనూ చర్చ జరగాల్సిందేనని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారని కర్రి వేణుమాధవ్ తెలిపారు. బీసీ సంఘాలు ఈ మేరకు సమావేశం ఏర్పాటు చేస్తే బీజేపీ కూడా అందులో పాల్గొంటుందని చెప్పినట్టు వివరించారు. అలాగే ఆర్. కృష్ణయ్యతో జీవీఎల్ ఫోన్లో మాట్లాడారని, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ల అంశంపై తమ మద్ధతు ఉంటుందని తెలిపారని అన్నారు. అనంతరం జీవీఎల్‌ను కర్రి వేణుమాధవ్ సహా పలువురు బీసీ సంఘాల నేతలు సన్మానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement