Tuesday, May 21, 2024

Delhi | ముగిసిన లోకేష్ ఢిల్లీ పర్యటన.. 6న రాజమండ్రి జైలులో బాబుతో ములాఖత్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన ముగిసింది. గురువారం సాయంత్రం విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని)తో కలిసి బయల్దేరిన ఆయన రాత్రికి విజయవాడ చేరుకున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత గత నెల 14న ఢిల్లీ చేరుకున్న లోకేష్ అప్పట్నుంచి ఇక్కడే ఉన్నారు.

కొందరు కేంద్ర పెద్దలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సుప్రీంకోర్టు అడ్వకేట్లు, జాతీయ మీడియా ప్రతినిధులతో ఆయన మంతనాలు జరిపారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సమయంలో వివిధ పార్టీల ఎంపీలను కలిసి చంద్రబాబు అరెస్టుపై చర్చించారు. పలు నిరసన ప్రదర్శనల్లోనూ ఆయన పాల్గొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఎంపీ కనకమేడల నివాసంలో ఆయన నిరాహార దీక్ష చేశారు.

సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడి ఎస్‌ఎల్పీ మూడు సార్లు వాయిదా పడడంతో లోకేష్ తన విజయవాడ పర్యటనను వాయిదా వేస్తూ వచ్చారు. ఇదే సమయంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం అధికారులు లోకేష్‌ను విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశిస్తూ సీఆర్పీసీ సెక్షన్ 41(ఏ) ప్రకారం నోటీసులు అందజేశారు. ఢిల్లీలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో లోకేష్ ఉన్న సమయంలో అధికారులు ఆయనకు నోటీసులను స్వయంగా అందజేశారు.

- Advertisement -

ఆ నోటీసుల ప్రకారం అక్టోబర్ 4న తాడేపల్లిలోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాల్సినప్పటికీ, హైకోర్టు తేదీని అక్టోబర్ 10కు మార్చడంతో లోకేష్ తన ఢిల్లీ పర్యటన కొనసాగిస్తూ వచ్చారు. మరోవైపు సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు విచారణ అక్టోబర్ 9 (సోమవారం)కు వాయిదా పడిన నేపథ్యంలో ఆయన విజయవాడ బయల్దేరారు.

అక్కణ్ణుంచి నేరుగా రాజమండ్రి చేరుకుని చంద్రబాబు నాయుడితో శుక్రవారం జైలులో ములాఖత్ కానున్నారు. రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలను ఆయన బాబుకు వివరించనున్నారు. సోమవారం సుప్రీంకోర్టులో కేసు విచారణ చేపట్టే సమయానికి ఆయన ఢిల్లీ తిరిగొచ్చే అవకాశం ఉంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement