Friday, May 3, 2024

దిగ్విజయ్ సింగ్ వచ్చే వరకు ఆగుదాం, అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది : వి.హెచ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న విబేధాలు, వర్గ పోరును పరిష్కరించే బాధ్యతను పార్టీ అధిష్టానం దిగ్విజయ్ సింగ్‌కు అప్పగించిన నేపథ్యంలో ఆయన వచ్చేవరకు వేచిచూద్దామంటూ సీనియర్ నేత వి. హనుమంత రావు అన్నారు. పార్టీలోని సీనియర్లను ఉద్దేశించి మాట్లాడుతూ అందరితో పరిచయాలున్న దిగ్విజయ్ సింగ్ అందరికీ న్యాయం చేస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ టీపీసీసీ కార్యవర్గం కూర్పులో ఒరిజినల్ కాంగ్రెస్‌వాదులకు అన్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు. కమిటీలో స్థానం కల్పించినవారిని తీసేయాలనో, రాజీనామాలు చేయాలనో తాము కోరలేదని, తరతరాలుగా జెండా మోసినవాళ్లకు స్థానం కల్పించాలని మాత్రమే కోరుతున్నామని వీహెచ్ స్పష్టం చేశారు.

ప్రస్తుతం పార్టీలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులను చక్కదిద్దేందుకు అధిష్టానం నియమించిన దిగ్విజయ్ సింగ్ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇంచార్జిగా పనిచేశారని, ఆయనకు రాష్ట్రంలోని పరిస్థితులపై అవగాహన ఉందని వీహెచ్ అన్నారు. అన్యాయానికి గురైనవాళ్లకు ఆయన న్యాయం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. హైకమాండ్‌లో కదలిక వచ్చిన నేపథ్యంలో సీనియర్లు, అసంతృప్తులు తలపెట్టిన సమావేశాన్ని రద్దు చేసుకోవాలని ఆయన సూచించారు. ఇలాంటి సమావేశాలతో పార్టీకి నష్టం జరుగుతుందని అన్నారు. అందుకే దిగ్విజయ్ సింగ్ వచ్చేవరకు ఆగి, అన్ని సమస్యలను ఆయనకే చెప్పుకుందామని వీహెచ్ పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement