Wednesday, May 15, 2024

Big story | ఎన్నికల వేళ కూలీల కరవు.. కుదేలైన నిర్మాణ రంగం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పొలంలో హలం పట్టాలన్నా,అందమైన ఇల్లు కట్టాలన్నా, నిర్మాణ రంగాలతో అనేకరంగాల్లో విస్తరించిన అడ్డకూలీలు ఎన్నికల ప్రచారంలో కూడా భాగస్వామ్యం అవుతున్నారు. ప్రస్తుతం వారులేనిదే జెండాలు ఎగరడంలేదు, బహిరంగ సభలు జరగడంలేదనేది కూలీల అడ్డల్లో నిత్యం కనిపిస్తున్న దృశ్యాలు. కూలీల అడ్డాల్లో గుత్తే దారుల పేరుతో అవతరించిన కాంట్రాక్టర్లు పార్టీల సభలకు, ప్రచారానికి, జెండాలు కట్టేందుకు కూలీలను సరఫరా చేస్తున్నారు. ఒక్కో కూలీ దగ్గర కమిషన్‌ పద్ధతుల్లో గుత్తేదారులు కూలీలకు రాజకీయ ఉపాధి కల్పిస్తున్నారు.

- Advertisement -

కార్మిక శాఖ అంచనా మేరకు హైదరాబాద్‌ లోని నాంపల్లి, ముషీరాబాద్‌, రాంనగర్‌, జూబ్లిహిల్స్‌, బాలానగర్‌, కూకట్‌ పల్లి, లిబర్టీలతో పాటుగా సుమారు 250 కూలీల అడ్డాలు ఉన్నాయి. సుమారు 12 లక్షల మంది గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అడ్డమీద కూలీలు నిత్యం పనులకోసం వేచి ఉంటారు. అయితే అందులో అనేక రకాల కూలీలు ఉంటారు. అత్యధికంగా గ్రామాల్లో పనులు దొరకని రైతుకూలీలు, రాష్ట్రంలో ఉపాధికోసం వచ్చిన వలస కూలీలు, హోటళ్లలో పనిచేసే వారు, నిర్మాణ రంగంలోని వివిధ పనులు చేసే నైపుణ్యత కల కూలీలు, మట్టిపని చేసే నిరక్షరాస్యుల తో పాటు తప్పని సరిపరిస్థితుల్లో విద్యావంతులు కూడా నైపుణ్యత కల పనుల కోసం అడ్డలమీదకు వస్తుంటారు.

రాష్ట్రంలో విస్తరించిన పట్టణీకరణతో హైదరాబాద్‌తో పాటుగా వంరంగల్‌, కరీంనగర్‌ తో పాటు అనేక జిల్లాల్లోని అడ్డాల్లో కూలీలు నిత్యం పనుల కోసం వేచి ఉంటారు. వీరికి పనిదొరికితే రోజుకు రూ.400 నుంచిరూ 700 కూలీ లభిస్తోంది. ప్రస్తుత ఎన్నికల వాతావరణంలో కూలీల అడ్డాలు ప్రచార క్షేత్రాల అడ్డాలు గా మారాయి. ఒక్కో గుత్తేదారు 10 మంది నుంచి 50 మంది వరకు కూలీలకు నాయకత్వం వహిస్తూ రాజకీయ పార్టీల సభలకు, ప్రచారానికి, జెండాలు కట్టేందు, జెండాలు మోసేందుకు ఉపాధి కల్పిస్తున్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రానికి నిత్యం బీహార్‌, రాజస్థాన్‌, ఏపీ, మహారాష్ట్ర నుంచి వస్తున్న కూలీలకు సులువుగా పనులు లభించడంతో దాదాపుగా నిర్మాణ రంగంలో నిశ్శబ్దం అలుముకుంది. అడ్డాల్లో నిర్మాణ రంగాల్లో పనిచేసేందుకు కూలీలు లభించడంలేదని యాదగిరి అనే తాపీ మోస్త్రీ ఆందోళన వ్యక్తంచేశారు. ఇదిలా ఉండగా చదువుకున్న వారికి కూడా బస్తీల్లో ఉపాధి దొరకడం గమనార్హం. స్థానిక నాయకులు ఒటరు జాబితాలు రాసే పనిని కాస్తా చదువుకున్న వారికి అప్పగిస్తు వంద స్లిప్‌లకు రూ. 50 ఇస్తున్నారు.

నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్‌ దగ్గర, నాంపల్లి రైల్వే స్టేషన్‌ ఎదురుగా, కృష్ణా నగర్‌ సెవన్‌ ఎకర్స్‌ ముందు, యుసూఫ్‌ గూడా కూడలీలో ఎన్నికల ముందు నిత్యం వందల్లో ఉండే అడ్డకూలీలు ఉదయం పది గంటలు దాటితే అగుపించడంలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూలీలకు ఎన్నికలు ఉపాధి కల్పిస్తున్నాయి. పొలం పనులకు కూలీలు కరువవుతున్నారు. నిర్మాణ రంగంలో పనులు స్థంభించాయి. సభలకు వెళ్లే కూలీలుకు రూ. 600లు, జెండాలు నమోసే కూలీలకు రూ. 800 వందలతో పాటు భోజనం ఇస్తున్నారని నాంపల్లి అడ్డకూలీ సైదులు చెప్పారు.

సామాజిక కార్యకర్త గోపీ నాథ్‌ మాట్లాడుతూ ప్రధాన రాజకీయ పార్టీలు పోటీతో ప్రచారం నిర్వహిస్తుండంతో అడ్డకూలీలకు డిమాండ్‌ పెరిగిందన్నారు. ప్రధానంగా ఎక్కడి వారు అక్కడ కాకుండా అడ్డాలనుంచి వేరువేరు ప్రాంతాల్లో కూలీలు ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమవుతున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి అడ్డకూలీలకు ఎన్నికలు ఉపాధి చూపుతున్నా ఎన్నిలైన అనంతరం శాశ్వత ఉపాధికోసం చర్యలు తీసుకునే నాయకులు ఎంతమందని ఆయన వాపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement