Friday, May 3, 2024

కోదండరాం చలో ఢిల్లీ.. రేపు జంతర్ మంతర్‌లో మౌన దీక్ష

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర సమస్యల పరిష్కారం కోరుతూ తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని తలపెట్టారు. రేపు (సోమవారం) జంతర్ మంతర్ వద్ద మౌనదీక్ష సహా వివిధ రకాలుగా నిరసన ప్రదర్శనలు చేపట్టాలని నిర్ణయించారు. ఇవ్వాల (ఆదివారం) పార్టీ నేతలతో కలిసి ఢిల్లీ చేరుకున్న ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడక ముందు ఏవైతే సమస్యలు, అసమానతలు ఉన్నాయో నేటికీ అవే కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మార్చుకుని భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాత రాష్ట్ర సమస్యలను పూర్తిగా గాలికొదిలేసిందని కోదండరాం ఆరోపించారు.

- Advertisement -

ఈ నేపథ్యంలో రాష్ట్ర సమస్యలపై జాతీయస్థాయిలో చర్చ జరిగేలా ఢిల్లీలో కార్యక్రమాలను తలపెట్టామని వెల్లడించారు. ఇందులో భాగంగా సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తొలుత తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న జల వనరుల సమస్యలపై మాట్లాడతామని, అనంతరం గంటపాటు మౌనదీక్ష చేపడతామని వెల్లడించారు. మంగళవారం ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలన అనే అంశంపై సెమినార్ ఏర్పాటు చేశామని, ఇందులో వివిధ రంగాల నిపుణులు పాల్గొంటారని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తికావొస్తున్నా నేటికీ ఆస్తుల పంపకాలు, సంస్థల విభజన పూర్తికాలేదని అన్నారు.

అలాగే విభజన చట్టంలో పొందుపర్చిన హామీలు సైతం పూర్తిగా అమలు కాలేదని తెలిపారు. విద్యార్థులకు ఉపయోగపడే గిరిజన విశ్వవిద్యాలయం, హార్టికల్చర్ యూనివర్సిటీ వంటి విద్యాసంస్థలు సైతం ఏర్పాటు కాలేదని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం చాలాకాలంగా డిమాండ్ చేస్తున్న ఖమ్మం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కూడా అమలుకు నోచుకోలేదని చెప్పారు. ఈ నేపథ్యంలోనే తాము ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు తలపెట్టామని, ప్రజలందరూ మద్ధతివ్వాలని ఆయన కోరారు. మీడియా సమావేశంలో ప్రొఫసెర్ కోదండరాంతో పాటు తెలంగాణ జన సమితి ప్రధాన కార్యదర్శి అంబటి శ్రీనివాస్, ఆశప్ప, న్యాయవాది రవీందర్ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement