Thursday, May 9, 2024

Delhi | రాజకీయాలు పక్కన పెట్టి మణిపూర్‌లో శాంతి నెలకొల్పండి : మిథున్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెగల మధ్య ఘర్షణలతో అశాంతి నెలకొన్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో తక్షణమే శాంతిని పునఃస్థాపితం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. బుధవారం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో ఆ పార్టీ తరఫున లోక్‌సభ ఫ్లోర్‌లీడర్ మిథున్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు ఎక్కడైతే పూజింపబడతారో అక్కడ దేవతలు నడయాడతారన్న ఆర్యోక్తితో మిథున్ రెడ్డి తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

అయితే మణిపూర్‌లో చోటుచేసుకున్న ఘటనలు చాలా బాధాకరమని, మహిళలపై నేరాలకు పాల్పడ్డవారి పట్ల ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరించాలని సూచించారు. అలాగే రెండు తెగల మధ్య సామరస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం ప్రయత్నించాలని అన్నారు. మణిపూర్ ఘటనలు అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్టను దిగజార్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల్లో తనకు తెలిసిన చాలా మంది ఫోన్లు చేసి “మీ దేశంలో ఏం జరుగుతోంది?” అంటూ ప్రశ్నించారని మిథున్ రెడ్డి అన్నారు.

భిన్నత్వంలో ఏకత్వం అనే నినాదమే భారతదేశ విధానమని.. అలాంటి దేశంలో ఇలాంటి ఘటనలు జరగకుండా, పునరావృతం కాకుండా చూసుకోవాలని అన్నారు. మణిపూర్‌లో తక్షణమే శాంతిని నెలకొల్పాలని, ఇందుకోసం అందరం కలిసి రాజకీయాలు పక్కనపెట్టి పరిష్కారం దిశగా అడుగులు వేయాలని మిథున్ రెడ్డి అన్నారు. మత ఘర్షణలు, తెగల మధ్య ఘర్షణలు లేకుండా చూడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని గుర్తుచేశారు.

- Advertisement -

మణిపూర్ సమస్య పరిష్కారానికి వైఎస్సార్సీపీ తరఫున రెండు అంచెల పరిష్కారాన్ని సూచిస్తున్నామని, అందులో మొదటిది హింసాత్మక ఘటనలను అదుపు చేయడానికి తగినంత భద్రతా బలగాలను రంగంలోకి దించడమేనని అన్నారు. పరిస్థితులు అదుపులోకి తెచ్చిన తర్వాత ఘర్షణలు నెలకొన్న రెండు తెగల మధ్య సయోధ్య కుదిర్చేందుకు సంప్రదింపులు, మంతనాలు, చర్చల ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు.

మణిపూర్ దేశానికి ముఖద్వారం అని, పొరుగు దేశం మయన్మార్‌తో బలహీనమైన సరిహద్దు కలిగి ఉందని మిథున్ రెడ్డి అన్నారు. బలహీనమైన సరిహద్దు దేశానికి మంచిది కాదని వెల్లడించారు. మణిపూర్ బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుందని చెప్పారు. చివరగా సభలో సంఖ్యాబలం ప్రకారం చూస్తే అవిశ్వాస తీర్మానం పాసయ్యే అవకాశమే లేదని, అలాంటప్పుడు ఈ తీర్మానంతో ఉపయోగం లేదని అన్నారు. అందుకే తీర్మానానికి మద్దతు ఇవ్వడం లేదని, మణిపూర్‌లో శాంతి నెలకొనాలన్నదే తమ విధానమని పునరుద్ఘాటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement