Sunday, May 5, 2024

గుజరాత్ ఫలితాలతో కేసీఆర్‌కు నిద్రపట్టదు, గుజరాత్ తరహాలోనే 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు : బీజేపీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: గుజరాత్ ఎన్నికల ఫలితాలతో తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావుకు నిద్రపట్టదని భారతీయ జనతా పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. గురువారం గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన సందర్భంగా బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బీజేపీని అణిచేస్తామని కేసీఆర్ ప్రగర్భాలు పలికారని, కానీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే ఆయనకు నిద్ర కూడా పట్టదని జీవీఎల్ ఎద్దేవా చేశారు. ఈ ఫలితాలతో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచన కూడా విరమించుకుంటారేమో అని వ్యాఖ్యానించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఓటమిపాలవడం కంటే పదవీకాలం పూర్తయ్యేవరకైనా అధికారాన్ని అనుభవిద్దామనుకుంటారని జీవీఎల్ అన్నారు.

తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని, ఆ పార్టీకి ప్రత్యామ్నాయంగా ప్రజలు బీజేపీ వైపే చూస్తున్నారని సూత్రీకరించారు. ఇందుకు మునుగోడు ఉపఎన్నికల ఫలితాలే నిదర్శనమని అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ గుజరాత్ తరహాలోనే రికార్డు స్థాయి మెజారిటీ సాధిస్తుందని జీవీఎల్ ధీమా వ్యక్తం చేశారు. 2019లో సొంతంగా 303 సీట్లు సాధించగా, 2024లో 404 సీట్లు సాధిస్తామని అన్నారు. ఇదేమీ అతిశయోక్తి కాదని, ప్రజలు బీజేపీ అభివృద్ధి అనుకూల రాజకీయాలను ఆదరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారడం కంటే వీఆర్ఎస్ తీసుకోవడం ఖాయమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించడం లేదని తెలిపారు.

- Advertisement -

ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయడం కారణంగానే బీజేపీ వ్యతిరేక ఓటు చీలి ఎక్కువ సీట్లు గెలుపొందిందని కొందరు నేతలు చేస్తున్న విశ్లేషణను ఆయన తప్పుబట్టారు. గుజరాత్‌లో 52.5% ఓట్లను బీజేపీ పొందిందని, గతం కంటే ఓటు శాతం పెరగడం బీజేపీపై పెరిగిన ఆదరణకు నిదర్శనం తప్ప వ్యతిరేక ఓటు చీలికకు నిదర్శనం కాదని అన్నారు. కాంగ్రెస్, ఆప్ ఓట్ల శాతం కలిపినా కూడా బీజేపీ ఓట్ల శాతానికి చేరుకోలేదని అన్నారు. బీజేపీ పనితీరును చూసే ప్రజలు ఓటేసి, రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేనన్ని సీట్లు కట్టబెట్టారని జీవీఎల్ సూత్రీకరించారు. కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇకపోతే ధరల పెరుగుదల వంటి సమస్యలు ఎన్నికలపై ప్రభావం చూపలేదా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ద్రవ్యోల్బణం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సమస్య అని, అయితే ఆ సమస్యను అధిగమించే క్రమంలో భారతదేశమే అత్యుత్తమంగా వ్యవహరిస్తోందని అన్నారు. సమస్యను ఎదుర్కొంటున్న తీరును కూడా ప్రజలు గమనిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

ఆప్‌కు ఎదురైన పరిస్థితే కేసీఆర్‌కు ఎదురవుతుంది: తరుణ్ చుగ్

టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చి దేశ రాజకీయాల్లో సత్తాచాటాలని ఆశిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కేజ్రీవాల్ పరిస్థితే ఎదురవుతుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ అన్నారు. గోవా, ఉత్తరాఖండ్, గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురైన పరిస్థితే కేసీఆర్‌ ఎదుర్కొంటారని ఆయన వ్యాఖ్యానించారు. గుజరాత్, హిమాచల్ ఎన్నికల ఫలితాలపై మాట్లాడుతూ.. గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా ప్రధాని మోదీ పేద, మధ్యతరగతి వర్గాల అభ్యున్నతి కోసం చేసిన కృషిని ఆ వర్గాలు గుర్తించి ఆదరిస్తున్నారని, అందుకే ఓట్ల ద్వారా మోదీని ఆశీర్వదిస్తున్నారని తరుణ్ చుగ్ అన్నారు. గుజరాత్ ఫలితాల తరహాలోనే దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో, సార్వత్రిక ఎన్నికల్లో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement