Saturday, July 27, 2024

Krishna water Dispute | కృష్ణా వాటాలో కర్నాటక కిరికిరి..

అమరావతి, ఆంధ్రప్రభ : ఏపీ, తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులను కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిలోకి తీసుకువస్తూ కేంద్ర జలశక్తి జారీ చేసిన నోటిఫికేషన్‌ అమలుపై ఇప్పటికే సందిగ్ధత ఏర్పడగా న్యాయపరమైన చిక్కులు కూడా తప్పేటట్టు లేవని నీటిపారుదల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కృష్ణా జలాల పంపకాలపై తెలంగాణ ప్రభుత్వం కొత్త ట్రిబ్యునల్‌ కోసం డిమాండ్‌ చేస్తుండగా బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ (కృష్ణానదీ వివాదాల ట్రిబ్యునల్‌ – కెడబ్ల్యుడిటి-2) 2013లో ఇచ్చిన తుది తీర్పును అనుసరించి కేంద్ర ప్రభుత్వం గెజిట్‌లో మార్పులు చేయాలనీ కర్ణాటక డిమాండ్‌ చేస్తోంది.

కృష్ణాలోని నికర జలాల్లో 75 శాతం నీటిని వాడుకునేలా 2013లో ట్రిబ్యునల్‌ తీర్పు ఇచ్చింది.. తీర్పు ఇంతవరకు అమలు కాలేదు.. ట్రిబ్యునల్‌ ఇంకా మనుగడలోనే ఉన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తీర్పును నోటిఫై చేయాలని కర్ణాటక డిమాండ్‌ చేస్తోంది. దీనిపై సుప్రీంకోర్డును కూడా ఆశ్రయించింది. కర్ణాటక డిమాండ్‌ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అప్పట్లోనే వ్యతిరేకించగా రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా సుప్రీంకోర్టుకు తమ వాదనలు వినిపించింది. తెలంగాణ కూడా తాజాగా సుప్రీంలో కౌంటర్‌ దాఖలు చేసింది.

కృష్ణా జలాల కేటాయింపుల విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో తాము తీవ్రంగా నష్టపోయామని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. కృష్ణా జలాల్లో భాగస్వామ్య రాష్ట్రమైన మహారాష్ట్ర మాత్రం కర్ణాటకకు సానుకూలంగా ఉంది. కృష్ణా జలాలను 75 శాతం నీటి లభ్యత ఆధారంగా కర్ణాటక, మహారాష్ట్రలు వినియోగించుకోవచ్చని బచావత్‌ ట్రిబ్యునల్‌ చెప్పింది.. దీంతో బ్రజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ను నోటిఫై చేసినా అధికంగా నీటిని వినియోగించుకునే రాష్ట్రాల్లో కర్ణాటకతో పాటు తాము కూడా ఉంటామని మహారాష్ట్ర భావిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పడేలోపే పాత ట్రిబ్యునల్‌ను నోటిఫై చేయాలని కర్ణాటక డిమాండ్‌ చేస్తోంది. కర్ణాటక వాదనను ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి.

- Advertisement -

ఈ మేరకు సుప్రీంకోర్టుకు సైతం తమ వాదనలున వినిపించాయి. బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ను నోటిఫై చేయకపోవటం వల్ల కొత్త ప్రాజెక్టులు నిర్మించుకోలేకపోతున్నామని కర్ణాటక వాదించటంలో అర్ధం లేదు.. ఎగువ నుంచి వస్తన్న వరద జలాలకు అడ్డుకట్టలు నిర్మించి కృష్ణా జలాలతో తమ ప్రాజెక్టులన్నీ నింపుకుని తమకు ఎక్కువైన వరద జలాలనే దిగువ రాష్ట్రాలకు పంపిస్తున్నారు. చట్టవిరుద్దంగా, అనుమతుల్లేకుండా కర్ణాటక నిర్మించిన అనేక ఎత్తిపోతల పథకాలపై అభ్యంతరాలు, వాటి తాలూకు విచారణలు కొనసాగిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కొత్త వాదనలు తెరమీదకు తీసుకువచ్చి 75 శాతం నీటిని అధికారికంగా వాడుకునేందుకు కర్ణాటక ప్రయత్నిస్తోందనీ.. అదే అమలైతే నీటి ప్రవాహం లేని సమయాల్లో ఏపీ, తెలంగాణలు ఎడారులుగా మారే ప్రమాదముందని జలవనరుల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏపీ కన్నా తామెక్కువ నష్టపోయామని తెలంగాణ వాదిస్తోంది. అందువల్లనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కేటాయించిన నీటిలో 50:50 దామాషా ప్రకారం నీటి వాటాలను పున:పంపిణీ చేయాలనీ, దీని కోసం కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు- చేయాలని తెలంగాణ డిమాండ్‌ చేస్తోంది.

ఈ డిమాండ్‌ అమలుకు సాంకేతికంగా చిక్కుగా ఉన్న సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కేసులను కూడా తెలంగాణ విత్‌ డ్రా చేసుకుంది. కర్ణాటక వాదనే నెగ్గినా.. కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పడినా కృష్ణా జలాల పున:పంపిణీ, వాటి ఆధారంగా ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి నీటి వాడకం సమస్యలు మళ్లీ మొదలవుతాయి.. ఈ నేపథ్యంలో కృష్ణా జలాల భాగస్వామ్య రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన విధానాన్ని ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం కొనసాగుతోంది.. అప్పటిదాకా గెజిట్‌ అమలుపై అనిశ్చితి ఇలాగే కొనసాగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement