Friday, May 17, 2024

Delhi | జనసేన బెదిరింపులకు భయపడేది లేదు : నారాయణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తల బెదిరింపులకు తాను భయపడనని భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) జాతీయ కార్యదర్శి కే. నారాయణ అన్నారు. గురువారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ తీరుపై మరోసారి విమర్శలు చేశారు. ఎన్డీఏ సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ తరఫున రాజకీయ బ్రోకరిజం చేస్తున్నారంటూ నారాయణ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం సృష్టించాయి. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పవన్ అభిమానులు సోషల్ మీడియా ద్వారా బెదిరింపులకు పాల్పడుతుండడంతో నారాయణ ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

- Advertisement -

మొదట్లో పవన్ కళ్యాణ్ తమతో బావుండేవాడని, ఆయన నేపథ్యం కూడా వామపక్ష భావజాలంతో కూడుకున్నదే అని తెలిపారు. పవన్ కళ్యాణ్ లైబ్రరీలో సైతం వామపక్షాలకు సంబంధించిన పుస్తకాలు, సాహిత్యమే ఎక్కువగా ఉంటుందని గుర్తుచేశారు. అలాంటి వ్యక్తి బీజేపీ మీద ఎందుకంత ప్రేమను ప్రదర్శిస్తున్నాడో అర్థం కావడం లేదని నారాయణ అన్నారు. గతంలో స్పెషల్ ప్యాకేజిని పాచిపోయిన లడ్డూతో పోల్చిన పవన్ కళ్యాణ్.. అదే పార్టీతో చేతులు కలిపారని విమర్శించారు. యువత పవన్ కళ్యాణ్‌ను నమ్ముతున్నారని, వారికి అన్యాయం చేయవద్దని హితవు పలికారు.

మణిపూర్ హింసకు బీజేపీయే కారణం

ప్రపంచాన్నే నివ్వెరపరిచే హింసాత్మక ఘటనలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మంటల్లో తగలబడిపోతోందని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్లో తెగల మధ్య ఘర్షణకు కేంద్ర ప్రభుత్వమే కారణమని నిందించారు. అక్కడ ఉన్న మైటీస్ తెగకు గిరిజన తెగలకు వారే గొడవలు పెట్టారని ఆరోపించారు. మణిపూర్‌లో అదాని కంపెనీలకు 55 వేల ఎకరాల భూములు కట్టబెట్టడానికే తెగల మధ్య రిజర్వేషన్ అంశాన్ని తీసుకొచ్చారని అన్నారు. మణిపూర్ ఘటనలపై ప్రధాని మంత్రి నరేంద్ర పార్లమెంట్ బయట కాదు, లోపల సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జులై 26న దేశవ్యాప్తంగా ‘సేవ్ మణిపూర్’ పేరుతో సీపీఐ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చిందని తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement