Friday, May 3, 2024

IT Raids | బీఆర్‌ఎస్‌ నేతలకు ఐటీ సెగ.. తెలంగాణలో దాడులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : తెలంగాణలో ఆదాయపు పన్ను శాఖ అధికారుల (ఐటీ) దాడులు కలకలం రేపుతున్నాయి. భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ప్రజాప్రతినిధులే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, భువనగిరి, నాగర్‌ కర్నూల్‌ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌ రెడ్డి, మర్రి జనార్దన్‌ రెడ్డి ఇళ్లు, వ్యాపార కార్యాలయాలు, సంస్థలపై ఐటీ అధికారులు బుధవారం ఉదయం 6 గంటల నుంచి మొత్తం 60 బృందాలతో దాదాపు 70 చోట్ల ఐటీ సోదాలు నిర్వహించారు.

భువనగిరి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్‌రెడ్డికి చెందిన దిల్‌షుక్‌నగర్‌ కొత్తపేట ప్రాంతం గ్రీన్‌హిల్స్‌ కాలనీలోని నివాసం, ఇతర వ్యాపార కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. పైళ్ల శేఖర్‌ రెడ్డి తీర్థ గ్రూప్‌ పేరుతో రియల్‌ ఎస్టేట్‌, మైనింగ్‌, సోలార్‌ ఎనర్జీ, లిథియం బ్యాటరీల వ్యాపారాలు చేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు కర్ణాటకలో పలు రెసిడెన్షియల్‌, కమర్షియల్‌ ప్రాజెక్టులను తీర్థ గ్రూప్‌ పూర్తి చేసింది.

దక్షిణాఫ్రికాలో మైనింగ్‌ వ్యాపారాన్ని శేఖర్‌ రెడ్డి సంస్థలు నిర్వహిస్తున్నాయి. హిల్‌ల్యాండ్‌ టెక్నాలజీస్‌ కంపెనీ, మెయిన్‌ ల్యాండ్‌ డిజిటల్‌ టెక్నాలజీస్‌లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఈ రెండు కంపెనీలకు డైరెక్టర్‌గా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి భార్య వనిత కొనసాగుతున్నారు. ఐటీ అధికారులు ఏకకాలంలో 12 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయపు పన్ను చెల్లింపుల్లో అవకతవకలపై ఐటీ అధికారులు ఆరా తీశారు. తీర్థ గ్రూప్‌కి పైళ్ల శేఖర్‌రెడ్డి కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్నారు.

- Advertisement -

నాగర్‌ కర్నూలు ఎమ్మెల్యే నివాసాల్లో..

నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌ రెడ్డికి చెందిన కూకట్‌పల్లి జేసీ బ్రదర్స్‌ వస్త్ర షో రూమ్‌ మూసాపేటలోని ఆయన కార్యాలయం, గోదాముతో పాటు జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలోనూ ఐటీ అధికారులు సోదాలు జరిపారు. జేసీ బ్రదర్స్‌ మాల్స్‌కు సంబంధించి మర్రి జనార్దన్‌రెడ్డి, అతని బంధువులు డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. జేసీ బ్రదర్స్‌లో జరిగిన లావాదేవీలపై ఐటీ- అధికారులు ఆరా తీస్తున్నారు. జేసీ బ్రదర్స్‌తో పాటు మర్రి జనార్దన్‌ రెడ్డి ఇతర వ్యాపారాలు, సిబ్బంది నివాసాలపై కూడా సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

కాగా.. జూబ్లీహిల్స్‌లోని తమ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్న సమయంలోనే ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌ రెడ్డి తల్లి అమృతమ్మ అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే ఐటీ అధికారులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అలాగే, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి గచ్చిబౌలిలోని కొండాపూర్‌లో నివాసముంటున్న విల్లాతో పాటు ఆయన చైర్మన్‌గా ఉన్న సోనీ ప్రయివేట్‌ ట్రావెల్స్‌ సంస్థ కార్యాలయాలపైనా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

సోదాల్లో 50 బృందాలు: ఐటీ శాఖ

బుధవారం ఉదయం నుంచి ఏకకాలంలో జరుగుతున్న తమ సోదాల్లో యాభై బృందాలు పాల్గొన్నట్లు ఆదాయపు పన్నుశాఖ అధికారులు తెలిపారు. ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌ రెడ్డి, శేఖర్‌ రెడ్డి, ఎంపీ ప్రభాకర్‌ రెడ్డి నిర్వహిస్తున్న సంస్థల వ్యాపార లావాదేవీలు, అవి చెల్లిస్తున్న ఆదాయ పన్నుల్లో భారీ వ్యత్యాసం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించి.. ఆ మేరకు కేసు నమోదు చేసి.. తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

కాగా ఎంపీ ప్రభాకర్‌ రెడ్డికి సంబంధించి ఆయన నివాసం కొండాపూర్‌ బొటానికల్‌ గార్డెన్స్‌ సమీపంలో ఉన్న లుంబిని స్పింగ్స్‌ విల్లాతో పాటు ఆయన అనుచరుల ఇళ్లపై దాదాపు 15 వాహనాల్లో వచ్చిన ఐటీ అధికారులు.. వారితో పాటు భద్రత కోసం వచ్చిన సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది సోదాల్లో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా జూబ్లిహిల్స్‌ రోడ్డు నంబరు 36లో నాగర్‌ కర్నూల్‌ ఎమ్మెల్యే మరి జనార్ధన్‌ రెడ్డి ఇంటిపైన.. ఆయన కార్యాలయాలలో తనిఖీలు చేస్తున్నామన్నారు. అధికార పార్టీకి చెందిన ఈ ముగ్గురు ప్రజాప్రతినిధులు నిర్వహిస్తున్న వ్యాపారాలకు సంబంధించిన స్థిరాస్థి, హోటళ్ల వ్యాపార సంస్థలపై దాడులు నిర్వహించారు.

లావాదేవీలపై ఆరా

ఉదయం నుంచి కొనసాగుతున్న ఈ సోదాల్లో ఆయా సంస్థలు నిర్వహిస్తున్న వ్యాపార లావాదేవీలకు చెందిన వివరాలను ఐటీ బృందాలు పరిశీలిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం, అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఈ సంస్థలు నిర్వహించిన వ్యాపారాలను పరిశీలిస్తున్నారు. వాటికి వచ్చిన ఆదాయం.. ఆయా సంస్థలు చెల్లించిన ఆదాయపు పన్ను తదితర అంశాలపై ఆరా తీస్తున్నాయి. రికార్డులు పరిశీలించిన తరువాతనే.. ఐటీ శాఖ పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎన్నికలకు ముందు అధికార పార్టీపై ఇలాంటి దాడులు సహజమే అని.. ఇది బీజేపీ ఆడుతున్న నాటకమని బీఆర్‌ఎస్‌ వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి.

ముషీరాబాద్‌లో..

ముషీరాబాద్‌ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు కొండపల్లి మాధవ్‌ ఇంట్లో ఐటీ దాడులు జరిగాయి. బుధవారం ఉదయం నుంచి ఐటీ అధికారులు మాధవ్‌ ఇంట్లో కొన్ని పత్రాలను పరిశీలించినట్లు తెలిసింది. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుల ఇళ్లల్లో ఐటీ దాడుల నేపథ్యంలో మాధవ్‌ ఇంట్లో కూడా ఐటీ దాడుల విషయం ముషీరాబాద్‌ నియోజకవర్గంలో సంచలనం సృష్టించింది. మీడియాను పరిసరాల్లోకి రానివ్వడం లేదు.

గతంలోనూ..

గతంలో మంత్రి మల్లారెడ్డి ఇల్లు, విద్యా సంస్థలపై జరిగిన ఐటీ దాడులు కలకలం సృష్టించాయి. వరుసగా మూడు రోజుల పాటు ఐటీ అధికారులు మల్లారెడ్డి, ఆయన బంధువుల నివాసాల్లో తనిఖీలు చేసి భారీ మొత్తంలో నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇక, మరో మంత్రి గంగుల కమలాకర్‌, బీఆర్‌ఎస్‌ ఎంపీ గాయత్రి రవి ఇళ్లల్లో కూడా ఐటీ సోదాలు జరిగాయి. కాగా, ఎంపీ, ఎమ్మెల్యేల నివాసాలు, ఆఫీస్‌లపై వరుసగా ఐటీ అధికారులు దాడులు చెయ్యడం బీఆర్‌ఎస్‌ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement