Saturday, April 27, 2024

Delhi | అది బీజేపీ కాదు.. బీఫ్ జనతా పార్టీ : యుగతులసి పార్టీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గో పరిరక్షణకు చర్యలు చేపట్టకపోగా బీఫ్ ఎగుమతులను మరింత ప్రోత్సహిస్తోందని యుగ తులసి పార్టీ అధ్యక్షులు కొలిశెట్టి శివకుమార్ ఆరోపించారు. గురువారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. లోక్‌సభ ఎన్నికల్లో యుగ తులసి పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. తాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నుంచి బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించారు.

గో పరిరక్షణ కోసం ప్రధాని చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. అందుకే తాను బీజేపీని బీఫ్ జనతా పార్టీగా సంబోధిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం రోడ్ రోలర్ గుర్తు కేటాయించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని డిమాండ్ చేశారు. మోడీ పాలనలో బీఫ్ ఎగుమతుల్లో భారత్ నెంబర్ వన్ గా ఉందని ఆరోపించారు. గో వధ పై కోర్టు తీర్పులు, వన్యప్రాణుల సంరక్షణ చట్టాలు అమలుకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశంలో గోవులను కంటైనర్లలో, బస్సుల్లో తరలిస్తున్నారని చెప్పారు. సమాజ హితం కోసం గోవుల సంరక్షణ అజెండాగా తాము ప్రజల్లోకి వెళ్తున్నామని అన్నారు. మోడీ చాయ్ పే చర్చా అన్నారని, కానీ ఇప్పుడు దేశంలో గాయ్ పే చర్చ జరగాల్సిన పరిస్థితులున్నాయని అన్నారు. దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నానంటున్న మోడీ గో సంరక్షణ కు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement